Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మెగా హీరో సాయి ధరమ్ తేజ్, కరుణాకరన్‌ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘తేజ్ ఐలవ్ యూ’. ఈ చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఇటీవలే ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్ మరియు టీజర్లను విడుదల చేశారు. అయినా ఇప్పటి వరకు సినిమా గురించి సోషల్ మీడియాలో కాని, జనాల్లో కాని చర్చ మొదలు కాలేదు. తేజూ గత చిత్రాల ఫలితాలు ఈ చిత్రంను వెంటాడుతున్నాయి. ‘విన్నర్’, ‘ఇంటిలిజెంట్’ ఇంకా పలు చిత్రాలతో తేజూ బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాడు. దాంతో ఈ సినిమా కూడా అంతకు మించి ఏమీ ఉండదనే అభిప్రాయంతో జనాలు ఉన్నారు. ఆ కారణంగానే సినిమాను లైట్ తీసుకుంటున్నారు. సినిమా విడుదలకు దగ్గర పడుతున్న సమయంలో ఇలాంటి రెస్పాన్స్ సినిమాకు చాలా ప్రమాదం అంటూ సినీ వర్గాల వారు చెబుతున్నారు.
సాయి ధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్‌లు జంటగా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ మెమరీ లాస్ పేషంట్‌గా కనిపించబోతుంది. కాస్త విభిన్నమైన కాన్సెప్ట్ కావడం వల్ల కూడా సినిమాకు ఆశించిన స్థాయిలో క్రేజ్ రావడం లేదు. కరుణాకరన్ కూడా గత కొంత కాలంగా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్‌ను అందుకోలేక పోయాడు. ఇలా ఇద్దరు ఫ్లాప్‌లో ఉండటం వల్ల కూడా తేజ్ చిత్రాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ సినిమాను చూసేందుకు, కొనేందుకు ఆసక్తి చూపడం లేదు. దాంతో నిర్మాతలు సొంతంగానే ఈ సినిమాను పంపిణీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడినది. అలా చేస్తే సినిమా ఫలితం తారు మారు అయితే మొత్తానికి నిర్మాత లాస్ అవ్వడం ఖాయం. దాంతో ఈ సినిమాపై అంచనాలు పెంచడం, అందరి దృష్టిలో పడేలా చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.