Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
స్వచ్ఛ భారత్ గురించి కేంద్రప్రభుత్వం విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. ఆ కార్యక్రమం ప్రచారం కోసం వేలకోట్లు వెచ్చిస్తోంది. బహిరంగ మల, మూత్ర విసర్జన లేని దేశంగా భారత్ ను తీర్చిదిద్దాలని మోడీ కంకణం కట్టుకున్నారు. కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల మంత్రులే మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ ను గౌరవించడం లేదు. మహారాష్ట్ర మంత్రి రామ్ షిండేపై సోషల్ మీడియాలో చెలరేగుతున్న వివాదమే ఇందుకు ఉదాహరణ. సాధారణ ప్రజలు తప్పొప్పులను సరిదిద్దాల్సిన హోదాలో ఉన్న మంత్రి రామ్ షిండే.. తానే ఓ తప్పుచేశారు. రోడ్డు పక్కన మూత్ర విసర్జన చేసి స్వచ్ఛ భారత్ పరువుతీశారు. సోలాపూర్- బార్షీ మార్గంలో తన వాహనంలో ప్రయాణిస్తున్న మంత్రి మార్గమద్యంలో వెహికల్ నుంచి దిగి రోడ్డు పక్కన మూత్ర విసర్జన చేశారు.
ఇది ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. స్వచ్చ భారత్ పై సాధారణ ప్రజలకు అవగాహన కల్పించాల్సిన మంత్రే ఇలా ప్రవర్తించడమేమిటని నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే దీనిపై మంత్రి వివరణ ఇచ్చారు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని తెలిపారు. జల్ యుక్తా శివార్ పథకం కోసం నెలరోజుల నుంచీ రాష్ట్రవ్యాప్తంగా తీరిక లేకుండా తిరుగుతున్నానని, వరుస ప్రయాణాలతో అనారోగ్యానికి గురయ్యానని, ప్రస్తుతం జ్వరంతో బాధపడుతున్నానని మంత్రి ఆవేదన వ్యక్తంచేశారు. బార్షీ వెళ్లే మార్గంలో ఎక్కడా టాయిలెట్ కనిపించకపోవడంతో రోడ్డు పక్కనే మూత్ర విసర్జన చేయాల్సి వచ్చిందని రామ్ షిండే చెప్పారు. అయితే రామ్ షిండే వివరణపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. జాతీయ రహదారిపై టాయ్ లెట్ లేదని ఓ మంత్రే చెబుతున్నారని, నరేంద్రమోడీ స్వచ్ఛ భారత్ పథకం ఎలా ఉందో దీన్ని చూస్తే అర్ధమవుతుందని ఎన్సీపీ విమర్శించింది. స్వచ్ఛ భారత్ విఫలమయిందనడానికి ఈ ఘటనే ఉదాహరణ అని, స్వచ్ఛ భారత్ సెస్ పేరుతో కేంద్రం ప్రజల్ని దోచుకుంటోందని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ ఆరోపించారు.