తెలంగాణలోని హైదరాబాద్ చాదర్ ఘట్ పోలీసు స్టేషన్ పరిధిలో ఘోరం జరిగింది. ఆ ఏరియాలోని దళిత మైనర్ బాలికపై ముస్లిం సామాజిక వర్గానికి చెందిన యువకుడు అత్యాచారానికి పాల్పడిన విషయం కలకలం సృష్టిస్తోంది. అయితే ఈ ఘటనను తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ శ్రీ.డా.ఎర్రోళ్ల శ్రీనివాస్ సుమోటాగా స్వీకరించారు. అత్యాచార ఘటనపై వెంటనే స్థానిక పోలీసులు కేసు విచారణను చేపట్టి.. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అందుకు సంబంధించి పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలని కూడా తెలపారు. అయితే రెవిన్యూ అధికారులతో మాట్లాడి బాధితురాలికి అట్రాసిటీ కేసుకు సంబంధించిన ఎక్స్ గ్రేషియాను అందజేయాలని కూడా సూచించారు.
అదేవిధంగా బాధితురాలికి న్యాయం జరిగే వరకు అన్ని విధాలుగా అండగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ… చాదర్ ఘట్ లో జరిగిన ఘటనను సుమోటాగా స్వీకరించామని… ఇలాంటి దుర్ఘటనలు పునరావృత్తం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించామని వెల్లడించారు. అంతేకాకుండా బాధితురాలికి ఎక్స్ గ్రేసియా అందించాలని.. అన్ని విధాలుగా అండగా ఉండాలని సంబంధిత అధికారులకు సూచించామని కూడా తెలిపారు. ఇక రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు కమిషన్ అన్ని విధాలుగా అండగా ఉంటుందని కూడా శ్రీనివాస్ వివరించారు.