వారిద్దరూ మైనర్లు. ఆ వయసులో సహజంగా కలిగే ఆకర్షణను ప్రేమగా భావించారు. వీరిద్దరూ సన్నిహితంగా ఉంటున్న విషయం ఆమె ఇంటిలో తెలిసింది. పెద్దలు ఏమంటారో అని భయపడ్డారు.క్షణికావేశంలో ఇద్దరూ కలసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, అబ్బాయి మరణించాడు. అమ్మాయి ఇప్పుడు మృత్యువుతో పోరాడుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో జరిగిన ఘటన పూర్వాపరాల్లోకి వెళితే, ఇక్కడి బాపూజీ నగర్ లో నివాసం ఉండే పదో తరగతి చదువుతున్న బాలికకు, కేటీపీఎస్ కాలనీలో డిప్లొమా చదువుతున్న పోశం మణికంఠతో పరిచయం ఉంది. వీరిద్దరి మధ్యా గత కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తుందని వారి భావించారు. ఈ విషయం ఇటీవల ఆమె ఇంట్లో తెలిసింది. తండ్రి మందలించాడు. ఆమె ఈ విషయాన్ని అతడితో చెప్పింది.
ఇద్దరూ భయపడ్డారు కాంట్రాక్టర్స్ కాలనీలో నిర్మాణంలోగల మూడంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించారు. కింద పడిపోగానే భయంతో పెద్దగా అరిచారు. పెద్ద శబ్దం, అరుపులు వినిపించడంతో చుట్టుపక్కల వారు పరుగు పరుగున వచ్చారు. రక్తపు మడుగులో అపస్మారక స్థితికి చేరిన వారిద్దరినీ 108 సిబ్బంది స్థానిక ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. వారిని ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన మణికంఠ చనిపోయాడు. బాలిక కాళ్లు, చేతులు విరిగి, ముఖానికి తీవ్ర గాయాలైన స్థితిలో ఉండగా, మెరుగైన చికిత్స కోసం ఖమ్మం తరలించారు.