Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కావేరి వివాదంతో తమిళనాడు రాష్ట్రం అట్టుడుకుతోంది. మొన్నటికి మొన్న ఏకంగా సీఎం, డిప్యూటీ సీఎం లు నిరాహార దీక్ష చేస్తే ఈరోజు డీఎంకే నేతలు మరికొన్ని ప్రతిపక్ష పార్టీ నేతలతో కలిసి ఈ రోజు బంద్ ప్రకటించారు. కావేరి మెనేజ్మెంట్ బోర్డు విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యమైందని… ఈ విషయంలో వెనువెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరుతూ ఈ రోజు బంద్ కి పిలుపునిచ్చారు. అయితే ఈ బంద్ క్రమంలో ఈ రోజు చెన్నైలోని మెరీనా బీచ్ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు. కొన్ని చోట్ల ఏపీ బస్సులను ధ్వంసం చేశారు. బయటకు వచ్చిన తమిళనాడు బస్సులను కూడా ధ్వంసం చేశారు. వెల్లూరు ప్రాంతంలో 15 ప్రభుత్వ బస్సులపై డీఎంకే కార్యకర్తలు రాళ్లదాడి చేయగా వారిని పోలీసులు అరెస్టు చేశారు.
అన్నా సలాయ్ ప్రాంతంలోని బంద్ జరుగుతున్న ప్రాంతానికి డీఎంకే పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ రోజు బంద్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్షమంది పోలీసులను మోహరించగా… అందులో 15వేలమంది చెన్నైలోనే మొహరించి ఉన్నారు. ఈ బంద్ సందర్భంగా వివాదంతో సంబంధం ఉన్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన బస్సులను తమిళనాడులో బోర్డర్లో నిలిపివేశారు. పలుచోట్ల రాళ్ల దాడికి పాల్పడి విధ్వంసం సృష్టించారు… పలు రైళ్లు రద్దయ్యాయి.
అలాగే కొందరు రైతులను రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. ఈ బంద్ సందర్భంగా అన్నశాలైలో బందులో పాల్గొన్న డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షులు ఎంకే స్టాలిన్ రోడ్డుపై ధర్నాకు కూర్చున్నారు. ఆ తర్వాత ఆయన మెరీనా బీచ్ వద్దకు వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. పలుచోట్ల ఆందోళనకారులు ధర్నాకు దిగారు. అయితే అనూహ్యంగా తమిళనాడు చస్తున్న డిమాండ్ మీద మాజీ ప్రధాని దేవేగౌడ స్పందించారు. కావేరి నదీ జలాల వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రత్యేక నిర్వహణ మండలి ఏర్పాటు చేయాలని తమిళనాడు ప్రభుత్వం చేస్తున్న డిమాండును కేంద్రం పరిగణలోనికి తీసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని దేవేగౌడ హెచ్చరించారు. తమిళనాడు బెదిరింపులకు కేంద్రం తలొగ్గరాదన్నారు.