Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కేంద్ర బడ్జెట్ సెగలు ఆగక ముందే రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది. వైసీపీ కి ఇంకో షాక్ ఇచ్చేలా టీడీపీ పావులు కదుపుతోంది. అందులో భాగంగా వైసీపీ కి వీర విధేయుడిగా కనిపించే గుంటూరు ఎమ్మెల్యే ముస్తఫా మీద కన్నేసింది. ఆయన పార్టీ మారతాడని ఎప్పటినుంచో ప్రచారం సాగుతున్నప్పటికీ వైసీపీ తరపున చురుగ్గా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో అదంతా ఉత్తుత్తిడే అనుకున్నారు. అయితే అందులో నిజం ఉందన్న విషయం ఈరోజు బయటపడింది.
గుంటూరులో ఒమేగా ఆస్పత్రి ప్రారంభోత్సవానికి వచ్చిన సీఎం చంద్రబాబు తో వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా భేటీ అయ్యారు. నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు స్వయంగా బాబు దగ్గరకు ముస్తఫా ని తీసుకొచ్చారు. హెలిపాడ్ దగ్గర బాబుతో ఏకాంతంగా ముస్తఫా కొద్దిసేపు చర్చలు జరిపారు. దీంతో ఆయన పార్టీ మారడం ఖాయమని తెలుస్తోంది. వైసీపీ తరపున అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటున్న ముస్తఫా ఇలా హఠాత్తుగా కొత్త దారిలో నడవడం వెనుక ప్రధాన కారణం అధినేత జగన్, బీజేపీ తో అంట కాగడానికి దిగజారిపోవడమే అని సమాచారం. బీజేపీ వ్యతిరేకత అస్త్రంగా ముస్లిం మైనారిటీలు వైసీపీ కి అండగా నిలబడితే, వారి నమ్మకాన్ని వమ్ము చేస్తూ బీజేపీ తో పొత్తుకు తహతహలాడటాన్ని ముస్తఫా జీర్ణించుకోలేకపోతున్నారట. తాజాగా ముస్తఫా ఎపిసోడ్ చూస్తుంటే టీడీపీ మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ తో జగన్ కి ముచ్చెమటలు పోయించేలా వుంది.