హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఎదుట నిరాహార దీక్షకు సిద్ధపడ్డ గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొద్దిరోజుల క్రితం బీజేపీకి తన శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన తెలంగాణాలో గో రాక్షణే ధ్యేయంగా పనిచేస్తానని ప్రకటించారు. అయితే గోవులను రక్షించి వాటిని గోసాలలకి తరలిస్తున్న తన కార్యకర్తల మీద పోలీసులు కేసులు పెట్టడంతో పోలీసులకి అడ్డుపడడంతో ఈయన మీద కేసులు పెట్టారు. అయితే పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ ఆయన మంగళవారం బషీర్ బాగ్ లోని పోలీస్ కమిషనరేట్ ముందు నిరాహార దీక్ష చేయాలని భావించారు.
తన మీదా తన వారి మీదా పెట్టిన కేసులు ఎత్తివేయకపోతే తాను నిరాహార దీక్షకి దిగుతానని ప్రకటించారు. దీంతో నిన్న సాయంత్రం నుంచే ధూల్ పేట్ లోని ఆయన నివాసం వద్ద పోలీసులు మొహరించారు. మంగళవారం ఉదయం అరెస్ట్ చేశారు. అయితే, బక్రీద్ పండుగ నేపథ్యంలో పాతబస్తీలో గోవులను వధిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని రాజా సింగ్ హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పాతబస్తీలో ఉన్న గోవులను గోశాలకు తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.