పదవికి చేజేతులా చిక్కులు తెచ్చుకున్న తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి

పదవికి చేజేతులా చిక్కులు తెచ్చుకున్న తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి

తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి తన పదవికి చేజేతులా చిక్కులు తెచ్చుకున్నారు. కొద్ది రోజుల క్రితం వినాయక మండపం వద్ద టీడీపీ నేతలు కులం పేరుతో దూషించారంటూ ఆమె రచ్చ చేశారు. ఆ సమయంలో తాను క్రిస్టియన్‌ను అని తన భర్త కాపు సామాజికవర్గం వారని కూడా చెప్పుకున్నారు. అక్కడే  అసలు వివాదం ప్రారంభమయింది. తాడికొండ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. దళితుల కోసం కేటాయించిన నియోజకవర్గం. క్రిస్టియన్లు, కాపులు అక్కడ పోటీ చేయడానికి అనర్హులు. దళితులకు తీవ్ర అన్యాయం చేస్తూ.. దళిత కోటాలో ఆమె అక్కడి నుంచి పోటీ చేయడంపై విమర్శలు ప్రారంభమయ్యాయి. పలు దళిత సంఘాలు రాష్ట్రపతి కార్యాలయానికి ఫిర్యాదు చేశాయి.

ఈ ఫిర్యాదులపై రాష్ట్రపతి భవన్ స్పందించింది. రాష్ట్రపతి కార్యాలయం స్పందిస్తూ ఎమ్మెల్యే శ్రీదేవి అఫడవిట్‌ దాఖలులో లోపాలపై, ఎస్సీ రిజర్వేషన్‌ దుర్వినియోగంపై వచ్చిన అభియోగాలపై పూర్తి విచారణ జరిపించాల్సిందిగా ఏపీ చీఫ్‌ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందినందున ఆమె ఎన్నికను రద్దు చేయాలని లీగల్‌ రైట్స్‌ ప్రొటక్షన్‌ ఫోరం సంస్థకు చెందిన వారు గతంలో కోర్టును కూడా ఆశ్రయించారు. మతం మారినందున ఆమెకు రిజర్వేషన్ వర్తించదని  అయినప్పటికీ దళిత మహిళగా చెప్పుకుని  ఎస్సీలకు చెందిన సీటు నుంచి పోటీ చేసి దళితులను మోసం చేశారని వారు ఆరోపిస్తున్నారు. చట్టం ప్రకారం దళితులు మతం మార్చుకుంటే వారు ఎస్సీ హోదా కోల్పోతారు. అలాగే వారికి ఎస్సీ, ఎస్టీ చట్టం కింద వర్తించే ప్రయోజనాలు కూడా కోల్పోతారు.

అయితే మతం మారినట్లుగా నేరుగా చెప్పుకుంటున్నా  ఉండవల్లి శ్రీదేవి మాత్రం  ఎస్సీ కేటగిరీ కింద సర్టిఫికెట్ పొందారు. ఆ మేరకు ఎన్నికల్లో పోటీ చేశారు. ఇది కూడా తీవ్రమైన నేరంగా పరిగణించే అవకాశం ఉంది. ఈ క్రమంలో రాష్ట్రపతి భవన్ విచారణ కీలకం కానుంది. అయితే  చీఫ్ సెక్రటరీ రాష్ట్రపతికి ఎలాంటి నివేదిక పంపుతారన్నది కీలకం. నేరుగా రాష్ట్రపతి భవన్‌తో వ్యవహారం కాబట్టి తప్పుడు సమాచారం పంపలేరని ఉన్నది ఉన్నట్లుగా పంపాల్సి ఉంటుందని అంటున్నారు. అదే జరిగితే ఉండవల్లి శ్రీవారి పదవి పోగొట్టుకోవడమే కాదు  న్యాయపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్న అభిప్రాయం న్యాయవర్గాల్లో వ్యక్తమవుతోంది.