Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్ వచ్చిన జపాన్ ప్రధాని షింజో అబే దంపతులకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఘనస్వాగతం పలికారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో విమానం దిగిన షింజో అబేను ప్రధాని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత షింజో అబేకు త్రివిధ దళాలు గౌరవ వందనం సమర్పించాయి. అనంతరం మోడీతో కలిసి జపాన్ ప్రధాని రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ రోడ్ షోలో షింజో అబే తమ దేశ దుస్తుల్లో కాక… ప్రధాని మోడీలా కుర్తా పైజమా ధరించారు. ఆయన భార్య అఖీ అబే కూడా చుడీదార్ వేసుకున్నారు. దాదాపు 8 కిలోమీటర్లు ఈ రోడ్ షో సాగింది. జపాన్ ప్రధాని రాక సందర్భంగా అహ్మదాబాద్ సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నగరంలోని పోలీస్ సిబ్బందితో పాటు బాంబ్ స్క్వాడ్, క్విక్ రెస్పాన్స్ టీమ్‌లు, ఎన్ఎస్ జీ కమాండోల బృందం పహారా కాస్తున్నాయి. షింజో అబేకు ప్రధాని మోడీ ఈ రాత్రికి గుజరాతీ వంటకాలతో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. గురువారం షింజో అబే మోడీతో కలిసి భారత్ లో తొలి బుల్లెట్ రైలు పనుల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు.
మరిన్ని వార్తలు: