జీ-7 దేశాల సమ్మేళనంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ నిన్న బియారిట్జ్ నగరానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న మోదీ జీ-7సదస్సు సందర్భంగా ఈరోజ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మోదీ భేటీ కానున్నారు. ఇరువురి మధ్య 40 నిమిషాల పాటు చర్చ జరిగే అవకాశం ఉంది.
భారత కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 3.45 గంటలకు ఈ భేటీ జరిగే అవకాశం ఉంది. వాణిజ్య నిబంధనలు, ఇతర అంశాలపై మోదీ, ట్రంప్ చర్చిస్తారని సమాచారం. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత నెలకొన్న పరిస్థితులు, సీమాంతర ఉగ్రవాదం ప్రోత్సహిస్తోన్న పాక్ వైఖరి పైనా చర్చించే అవకాశం ఉంది.
సోమవారం సాయంత్రం 6.30 గంటలకు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌తో మోదీ భేటీ అవుతారు. నిజానికి నిన్న ఫ్రాన్స్ చేరుకున్న అనంతరం మోదీ ఇంగ్లండ్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో సమావేశమయ్యారు. అంతకు ముందు బహ్రెయిన్ రాజధాని మనామాలో కొత్త హంగులతో పునరుద్ధరించిన శ్రీనాథ్జీ ఆలయాన్ని ప్రారంభించారు.
అక్కడ నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మొన్న శనివారం బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘ద కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ది రెనైసాన్స్’తో మోదీని సత్కరించారు. మనామాలోని బహ్రెయిన్ జాతీయ స్టేడియంలో వేలమంది భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే.