Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఈ దేశంలో దేవాలయాల కంటే ముందు మరుగుదొడ్లు నిర్మించాలి. ఈ మాటలన్నది ఏ వామపక్ష నాయకుడో, ఆ భావజాలాన్ని అనుసరించే ఏ లెఫ్టిస్టో, దేవుణ్ని వ్యతిరేకించే ఏ నాస్తికవాదో కాదు. హిందుత్వమే అజెండాగా పనిచేస్తున్నారని నలువైపుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ. స్వామి వివేకానంద చికాగో ప్రసంగానికి 125 ఏళ్లు అయిన సందర్భంగా మోడీ కీలక ప్రసంగం చేశారు. బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు వస్తున్న అనేక విషయాలపై ఈ ప్రసంగంలో మోడీ పరోక్ష సమాధానాలిచ్చారు.
అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి స్వచ్ఛ భారత్ పేరుతో పరిశుభ్ర భారత్ కోసం కృషిచేస్తున్న మోడీ భారతీయుల ప్రవర్తనపై సూటి ప్రశ్న వేశారు. మాతృభూమిని చెత్తతో నింపుతున్న మనకు వందేమాతరం పాడే హక్కు ఉందా అని ప్రధాని ప్రశ్నించారు. వేదికపైకి తాను ప్రసంగించటానికి రాగానే అందరూ లేచి నిలబడి వందేమాతరం పాడారని, ఇది తనకు చాలా సంతోషం కలిగించిందని మోడీ అన్నారు. అయితే అదే సమయంలో తనకు ఓ సందేహం కూడా వస్తోందని నోట్లో పాన్ తో భారత భూమిపై ఉమ్మేసే మనకు వందేమాతరం పాడే హక్కు ఉందా అని ఆయన ప్రశ్నించారు. వందేమాతరం నినాదం ప్రతి భారతీయుడి హక్కు అన్న ప్రధాని దేశాన్ని, ఇళ్లను అపరిశుభ్రంగా ఉంచేవాళ్లకు వందేమాతరం పాడే హక్కులేదని వ్యాఖ్యానించారు.
భారత్ లో దేవాలయాల కంటే ముందు మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో నిర్వహించిన సదస్సులో మోడీ ఈ ప్రసంగం చేశారు. 9/11 అంటే అందరికీ ట్విన్‌టవర్స్ పై దాడులు గుర్తొస్తాయని, కానీ సరిగ్గా 125 ఏళ్ల క్రితం కాషాయవస్త్రాలు ధరించిన ఓ వ్యక్తి చికాగో వేదికగా భారత ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడని మోడీ అన్నారు. అంతర్జాతీయ వేదికలపై అవకాశం దొరికినప్పుడల్లా వివేకానందుడు మాతృభూమి గురించి, ఇక్కడి సంప్రదాయాలు, అపారమైన మేధో సంపద గురించి సుదీర్ఘ ప్రసంగాలు చేసేవారిని మోడీ తెలిపారు. వివేకానందుని కృషి వల్లే భారత్ ఇప్పుడు యువజాతిగా వెలుగొందుతోందని మోడీ అన్నారు.
వివేకానందుని ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలని పిలుపునిచ్చారు. నోబెల్ బహుమతి ద్వారా రవీంద్ర నాథ్‌ఠాగూర్, చికాగో ప్రసంగం ద్వారా స్వామి వివేకానంద ప్రపంచ పటంలో భారత్ పేరును చిరస్థాయిగా నిలిపారని, వారిద్దరూ బెంగాల్ కు చెందిన వారు కావటం యాధృచ్ఛికమని మోడీ వ్యాఖ్యానించారు. దేశ సంస్కృతికి విఘాతం కలగనంతవరకు కాలేజీల్లో విద్యార్థుల ఆధునిక పోకడలకు తాను వ్యతిరేకం కాదని మోడీ వివరించారు. మోడీ ప్రసంగాన్ని సుమారు 40వేల విద్యాసంస్థల్లో యూజీసీ ప్రత్యక్షప్రసారం చేసింది. కానీ వివేకానంద సొంతరాష్ట్రం బెంగాల్ లో మాత్రం మోడీ ప్రసంగాన్ని ప్రసారం చేసేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనుమతి ఇవ్వకపోవటం గమనార్హం.
మరిన్ని వార్తలు: