ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియా కాన్ఫరెన్స్ ఈరోజు నుంచే..!

దేశ ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈరోజు నుంచి రెండు రోజుల పాటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు. అయితే ఎంతకూ కరోనా వైరస్ తీవ్రత తగ్గకపోవడంతో.. ఆయా రాష్ట్రాలలో కరోనా వైరస్ నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే దానిపై ముఖ్యమంత్రులతో మాట్లాడనున్నారు. అయితే మే 11వ తేదీన చివరిసారిగా ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే.

అయితే.. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. రోజు రోజుకీ విపరీతంగా కేసుల సంఖ్య పెరుగుతుంది. దీంతో రెండురోజుల పాటు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించేందుకు ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా మంగళవారం అంటే ఈరోజు 21 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడనున్నారు మోడీ. వారు వరుసగా… పంజాబ్, అసోం, కేరళ, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, చత్తీస్‌గఢ్, త్రిపుర, హిమాచల్‌ప్రదేశ్, చండీగఢ్, గోవా, మణిపూర్, నాగాలాండ్, లడఖ్, పుదుచ్చేరి, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం, అండమాన్ నికోబార్ దీవులు, దాద్రానగర్ హవేలీ, దామన్, డయ్యూ, సిక్కిం, లక్షద్వీప్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లతో తొలిరోజు సమావేశం ఉంటుంది.

ఆ తర్వాత అంటే జూన్ 17వ తేదీ బుధవారం రోజు 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ్ బెంగాల్, కర్ణాటక, బిహార్, ఆంధ్రప్రదేశ్, హరియాణా, జమ్మూ కశ్మీర్, తెలంగాణ, ఒడిశా సీఎంలతో మాట్లాడతారు. ఈ రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు అత్యధికంగా నమోదవుతుండటంతో ప్రత్యేకంగా మోడీ వీరితో మాట్లాడనున్నారు.

కాగా ఈరోజు మధ్యాహ్నం 3.00 గంటలకు ఈ వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభం కానుంది. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు తొలుత మాట్లాడే అవకాశం ఉంది. బుధవారం చివరిగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌‌తో మాట్లాడిన తర్వాత సమావేశం ముగియనుంది. కాగా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం జరిపి.. వారి అభిప్రాయాలను సేకరించి. కరోనా వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.

అంతేకాకుండా మరోసారి పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమలుచేస్తారనే ప్రచారం కూడా విపరీతంగా వైరల్ అవుతోంది. ఇలాంటి సమయంలో మరో 35 రోజుల పాటు కఠినమైన లాక్‌డౌన్ విధిస్తారని, అందుకే ముఖ్యమంత్రులతో ప్రధాని భేటీ అవుతున్నారని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. కాగా బడ్జెట్ సమావేశాలు కారణంగా తాను ప్రధానితో భేటీకి హాజరుకావడం లేదని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపినట్లు సమాచారం అందుతుంది.