చంద్ర‌బాబును ఎదుర్కొనేందుకు మోడీ కొత్త వ్యూహం

Modi want to do Revenge on Chandrababu with CBI Enquiry

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన నాలుగేళ్ల కాలంలో రాజ‌కీయ‌ ప్ర‌త్య‌ర్థులను దెబ్బ‌తీయ‌డానికి ప్ర‌ధాని మోడీ అనుస‌రించిన వ్యూహం సీబీఐ దాడులు. త‌న మాట‌కు ఎదురుచెప్పిన ప్ర‌తివారి పైకీ ఆయ‌న సీబీఐని ఉసిగొల్పార‌ని రాజ‌కీయ పార్టీల నుంచే కాక‌… ప‌లు వ‌ర్గాల‌నుంచీ విమ‌ర్శ‌లు వినిపించాయి. అయిన‌ప్ప‌టికీ… మోడీ వెన‌క్కి త‌గ్గ‌లేదు. ఒక‌ప్పుడు సీబీఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఇన్విస్టిగేష‌న్ అని ప్ర‌చారం చేసిన బీజేపీ సీనియ‌ర్లు… ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను మోడీ ఉప‌యోగించుకుంటున్న తీరు చూసి అవాక్కయ్యారు. సీబీఐ, సీఐడీ, ఈడీ వంటి సంస్థ‌ల్ని గుప్పెట్లో పెట్టుకుని న‌డిపిస్తుంద‌ని పేరు తెచ్చుకున్న కాంగ్రెస్ కూడా మోడీ ముందు దిగ‌దుడుపుగానే మిగిలిపోయింది. మోడీ, అమిత్ షా ల రాజ‌కీయ ల‌క్ష్యాల సాధ‌న‌కు సీబీఐ ఓ పావుగా మారిందన్న ప్ర‌చారం నేప‌థ్యంలో ఢిల్లీ స్థాయిలో మ‌రోసారి ఈ అంశంపై చ‌ర్చ జ‌రుగుతోంది. దీనికి కార‌ణం… బీజేపీ కొత్త శ‌త్రుప‌క్షం టీడీపీనే.

ఎన్డీఏ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చింది మొద‌లు మోడీకి కంటిమీద కునుకులేకుండా చేస్తూ కొర‌క‌రాని కొయ్య‌గా మారిన టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబుపై సీబీఐ అస్త్రం ప్ర‌యోగించాల‌ని మోడీ, షా భావిస్తున్న‌ట్టు స‌మాచారం. ప‌ట్టిసీమ ప్రాజెక్టులో అవినీతిపై ద‌ర్యాప్తు అంటూ… మోడీ సీబీఐని రంగంలోకి దించాల‌ని ఆలోచిస్తున్న‌ట్టు ఢిల్లీ వ‌ర్గాల్లో ప్ర‌చారం సాగుతోంది. ఒక‌ప్పుడు ప‌ట్టిసీమ‌ను ఎంతో మెచ్చుకున్న బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు తో పాటు మ‌రికొంద‌రు నేత‌లు ఇప్పుడు ప‌ట్టిసీమ ప్రాజెక్టులో అవినీతి వంటి ఆరోప‌ణ‌లు చేయ‌డం ఇందులో భాగ‌మేనన్న అభిప్రాయం విన‌ప‌డుతోంది. క‌ర్నాట‌క ఎన్నిక‌లు ముగిసిన వెంట‌నే ఏపీ విష‌యంలో మోడీ, షా ఎత్తులు ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది.

మంత్రి గంటా శ్రీనివాస్ సైతం ఇదే విష‌యం వెల్ల‌డించారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును ఇబ్బందులు పెట్టాల‌న్న ఉద్దేశంతో కేంద్ర‌ప్ర‌భుత్వం సీబీఐని ఉసిగొల్పుతున్న‌ట్టు త‌మ‌కు స‌మాచారం ఉంద‌ని గంటా చెప్పారు. ఎటువంటి విచార‌ణ‌కైనా టీడీపీ ప్ర‌భుత్వం సిద్దంగా ఉంద‌న్నారు. ప‌ట్టిసీమ ప్రాజెక్టులో అవినీతి అంటూ సీబీఐ అడుగుపెట్ట‌నుంద‌ని, ఒక‌ప్పుడు బీజేపీ నేత‌లు ఆ ప్రాజెక్టును ఎంతో మెచ్చుకుని ఇప్పుడు విమ‌ర్శించ‌డం వెన‌క రాజ‌కీయ కుట్ర దాగి ఉంద‌ని విమ‌ర్శించారు. చంద్ర‌బాబు చుట్టూ ఉచ్చు బిగించాల‌ని మోడీ భావిస్తున్నార‌ని, అపార రాజ‌కీయ అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబు ఎవ‌రి ఉచ్చులోనూ ప‌డ‌బోర‌ని అన్నారు. ఎప్పుడు ఏం చేయాలో చంద్ర‌బాబుకు బాగా తెలుస‌ని, స‌రైన స‌మ‌యంలో స‌రైన నిర్ణ‌యం తీసుకోవ‌డంలో ఎవ‌రైనా ఆయ‌న త‌రువాతే అని గంటా వ్యాఖ్యానించారు. అటు మోడీ వ్యూహంపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సైతం ఇదేర‌క‌మైన అభిప్రాయం వ్య‌క్తంచేశారు. క‌ర్నాట‌క ఎన్నిక‌ల త‌ర్వాత మోడీ ఏపీపై దృష్టిపెట్టి… త‌నను ఇరుకున‌పెట్టాల‌ని వ్యూహం ర‌చించార‌ని చంద్ర‌బాబు ఆరోపించడం గ‌మ‌నార్హం.