16 సంవత్సరాల క్రితం ఇంగ్లండ్ భారత్ మధ్య నాట్‌వెస్ట్ సిరీస్ జరుగుతున్న రోజులవి టీమిండియా టార్గెట్ 326 కానీ 146 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది కానీ అసలు ఊహించని విధంగా యువరాజ్-మహ్మద్ కైఫ్‌ల జోడి టీమిండియాను విజయతీరాలకు చేర్చి గంగూలీ చొక్కా విప్పి సంతోషపడేలా చేసిన చారిత్రక రోజే ఇంగ్లండ్‌పై భారత్ నాట్‌వెస్ట్ సిరీస్ గెలిచిన అదే రోజున ఆనాటి హీరో మహ్మద్ కైఫ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 12 సంవత్సరాలుగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన కైఫ్ టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్నందించిన రోజునే రిటైర్మెంట్ ప్రకటించాడు.
‘అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. టీమిండియా జెర్సీ ధరించడం ఎంతో గౌరవంగా భావించా. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అంటూ బోర్డ్ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా, కార్యదర్శి అమితాబ్ చౌదరీలకు మెయిల్ పంపించాడు. ఇండియన్ జాంటీ రోడ్స్ గా పేరుగాంచిన మొహమ్మద్ కైఫ్ ఫీల్డింగ్ చేసేటప్పుడు చిరుతలా కదిలేవాడు. తన కెరీర్ లో 13 టెస్టులు, 125 వన్డేలకు కైఫ్ ప్రాతినిధ్యం వహించాడు. తాను క్రికెట్ ఆడటం మొదలు పెట్టినప్పుడు, ఏదో ఒక రోజు ఇండియాకు ఆడాలని కలలు కనేవాడినని, తన కలలను సాకారం చేసుకుంటూ భారత్ కు ఆడానని, తన జీవితంలో 190 రోజులు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించానని తెలిపాడు. క్రికెట్ నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన రోజు అని భావిస్తున్నానని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు.