Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భార్య హసిన్ జహాన్ చేసిన ఆరోపణల్ని ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ మరోసారి ఖండించాడు. హసిన్ జహాన్ చేసిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని స్పష్టంచేశాడు. ఈ అంశంపై పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలని తాను కోరుకుంటున్నానని తెలిపాడు. తాను బీసీసీఐ నుంచి ఆశిస్తున్నది ఒక్కటేనని, ఈ అంశంపై వారు పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని, అన్ని అంశాలను పరిశీలించాలని కోరాడు. భార్య చేసిన ఇతర ఆరోపణలపై స్పందిస్తూ… ఇది ప్రజల్లోకి వెళ్లిన కుటుంబ వ్యవహారమని, తన జట్టు సహచరులందరికీ తానేంటో తెలుసని, కొందరు బహిరంగంగానే మద్దతు తెలిపారని చెప్పాడు. అన్ని కుటుంబాల్లోనూ ఏదో ఒక సమస్య ఉంటుందని, కానీ అవి పరిమితులు దాటి బయటకు రావని ఆయన అభిప్రాయపడ్డాడు.
తన కుమార్తెకు ఎంతో జీవితం ముందుందని, ఆమె భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని, ఆమె కోసం చేయాల్సిందంతా చేస్తానని షమీ వ్యాఖ్యానించాడు. ఓ పాకిస్థానీ అమ్మాయి నుంచి షమీ డబ్బులు తీసుకున్నాడని హసిన్ జహాన్ ఆరోపించడంతో సీఓఏ అధినేత వినోద్ రాయ్ విచారణకు ఆదేశించారు. ఏసీయూ అధినేత నీరజ్ కుమార్ దీనిపై విచారణ జరుపుతున్నారు. నివేదిక అందాక దాన్ని బట్టి షమీపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే బీసీసీఐ షమి సెంట్రల్ కాంట్రాక్ట్ ను నిలిపి ఉంచింది. షమి తప్పుచేయలేదని తేలితే వెంటనే కాంట్రాక్ట్ ఇచ్చేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.