Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న మహానటిలో అనేకమంది సీనియర్ నటులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. తొలుత సినిమా ప్రకటించినప్పుడు సావిత్రి పాత్రలో కీర్తిసురేశ్, సినిమాలో మరో ముఖ్య పాత్రలో జమున, సావిత్రి భర్త పాత్రలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న విషయం మాత్రమే బయటకు వచ్చింది. సినిమా షూటింగ్ మొదలయిన తర్వాత మిగిలిన ముఖ్యపాత్రల కోసం నటీనటుల్ని ఎంపికచేసుకుంటున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. సావిత్రి కెరీర్ లో కీలకపాత్ర పోషించిన చక్రపాణి పాత్రకు ప్రకాశ్ రాజ్ ను తీసుకున్న నాగ్ అశ్విన్… తాజాగా… మరో ముఖ్యమైన పాత్ర కోసం మోహన్ బాబును ఒప్పించినట్టు తెలుస్తోంది.
సావిత్రికి సినీరంగంలో మంచి అనుబంధం ఉన్న నటుల్లో ఎస్వీరంగారావు ఒకరు. వారిద్దరూ తండ్రీకూతుళ్లలానే ఉండేవారని, సావిత్రి ఎస్వీఆర్ ను నోరారా నాన్నా అని పిలిచేదని అప్పటివారు చెబుతుంటారు. వారిద్దరి మధ్య ఉన్న అనుబంధానికి గుర్తుగా ఓ సంఘటనను కూడా ప్రస్తావిస్తుంటారు. సావిత్రి హీరోయిన్ గా చేసిన ఓ సినిమాలో ఎస్వీఆర్ విలన్ పాత్ర పోషించారు. ఆ సినిమాలో ఓ చోట కథ ప్రకారం… హీరోయిన్ ను విలన్ అత్యాచారం చేయాల్సిన సీన్ ఉంది. కొంత షూటింగ్ జరిగిన తరువాత… కూతురులాంటి సావిత్రితో ఆ సీన్ తాను చేయలేనన్నారట ఎస్వీఆర్. దీంతో దర్శక నిర్మాతలు ఆ సీన్ తొలగించివేశారు. సావిత్రిని ఎస్వీఆర్ తన సొంత కూతురులా భావించేవారనటానికి ఇది ఉదాహరణగా చెబుతుంటారు.
సావిత్రితో అంతటి అనుబంధం ఉన్న ఎస్వీఆర్ పాత్రలో మోహన్ బాబు నటించనున్నట్టు తెలుస్తోంది. అక్టోబరు నుంచి ఆయన షూటింగ్ లో పాల్గొంటారు. ఇక మహానటి మొదలయినప్పటి నుంచి అందరూ ఆసక్తిగా గమనిస్తోంది… సినిమాలో ఎన్టీఆర్, ఏఎన్నార్ పాత్రల్లో ఎవరు నటిస్తారని… దశాబ్దాల తరబడి తెలుగులో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సావిత్రి ఎన్టీఆర్, ఏఎన్నార్ తో కలిసి అనేక సినిమాల్లో నటించారు. మరి మహానటిలో కీర్తిసురేశ్ పక్కన రీల్ ఎన్టీఆర్, ఏఎన్నార్ లా ఎవరు కనిపిస్తారో చూడాలి.