Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఐసిస్ ఉగ్రవాదుల హింసాకాండకు బలయిన 38మంది భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తీసుకువచ్చారు. ప్రత్యేక విమానంలో మృతదేహాలను పంజాబ్ లోని అమృత్ సర్ కు తీసుకొచ్చినట్టు కేంద్ర మంత్రి వీకె సింగ్ వెల్లడించారు. భారతీయుల మృతదేహాలను భారత్ కు తీసుకొచ్చేందుకు వీకెసింగ్ ఆదివారం ఐఏఎఫ్ విమానంలో ఇరాక్ లోని మోసుల్ ప్రాంతానికి వెళ్లారు. మృతదేహాలను తీసుకుని ప్రత్యేక విమానంలో సోమవారం స్వదేశానికి చేరుకున్నారు. పరాయి దేశంలో 38మంది భారతీయుల మృతి దేశవ్యాప్తంగా తీవ్ర విషాదం నింపింది. ఉపాధి నిమిత్తం ఇరాక్ వెళ్లిన కొందరు భారతీయలు మోసుల్ నగరంలో కూలీలుగా పనిచేసేవారు. భారతీయుల బృందాన్ని 2014లో ఐసిస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. మోసుల్ నుంచి తిరిగి వస్తుండగా ఐసిస్ ఉగ్రవాదులు అడ్డగించి వారిని కిడ్నాప్ చేశారు. అప్పటినుంచి వారి ఆచూకీ కుటుంబ సభ్యులకు తెలియరాలేదు. వారిని విడిపించేందుకు భారత ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. బందీల్లో ఒకరైన హర్జిత్ మాసీ అనే వ్యక్తి ఇస్లామిక్ చెర నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడడంతో ఐసిస్ దారుణం వెలుగుచూసింది.
తనతో పాటు బందీలుగా ఉన్న మిగిలిన భారతీయులను బాదుష్ సమీపంలోని ఎడారిలో చంపేసినట్టు హర్జిత్ మాసీ చెప్పాడు. అయితే హర్జిత్ వ్యాఖ్యలను కేంద్రప్రభుత్వం తోసిపుచ్చింది. సరైన ధృవీకరణ లేకుండా వారందరూ చనిపోయారని భావించడం సరికాదని అభిప్రాయపడింది. కిడ్నాప్ అయిన వారి ఆచూకీ కోసం భారత్ ప్రయత్నాలు సాగిస్తుండగానే… ఇరాక్ అధికారులు గత ఏడాది జులైలో మోసుల్ నగరంలో ఒకే చోట వందల సంఖ్యలో సామూహిక సమాధులు గుర్తించారు. విచారణలో 38 మంది భారతీయులు చనిపోయినట్టు తేలింది. మృతదేహాలను సమాధి నుంచి వెలికి తీసి డీఎన్ ఏ పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారి మృతిపై విదేశంగమంత్రి సుష్మాస్వరాజ్ భారత పార్లమెంట్ లో ప్రకటన చేశారు. ఇస్లామిక్ ఉగ్రవాదులు 38 మంది భారతీయులను చంపేసారని, డీఎన్ ఏ పరీక్షలతో నిర్ధారించిన తర్వాతే వారి మృతిపై ప్రకటన చేస్తున్నామని సుష్మాస్వరాజ్ తెలిపారు. మృతులు పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమబంగ, బీహార్ కు చెందిన వారని చెప్పారు. ఈ వార్త విని దేశ ప్రజలంతా కలత చెందారు. ఉపాధి కోసం వెళ్లి మృత్యువాత పడ్డ తమవారిని తలచుకుని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.