Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అమ్మని మించి దైవమున్నదా
అత్మను మించి అద్దమున్నదా
జగమే.. పలికే.. శాశ్వత సత్యమిదె
అందరినీ కనే శక్తి.. అమ్మ ఒక్కతే
అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే
ఈ వాక్యాలు ఒక పాటలోని చరణం మాత్రమే కాదు. అర్ధం చేసుకునే వారికీ అమ్మ విశిష్టత కనపడుతుంది. అవును అమ్మని మించిన దైవం ఎక్కడుంది. దేవుడు ప్రతి మనిషి దగ్గరా ఉండలేక అమ్మని సృష్టించాడు అంటారు. ఎంత గొప్ప వ్యక్తి అయినా ఒక అమ్మ గర్భం నుండే రావాలి అది అమ్మ విశిష్టత. ఒక కవి రాసిన ఈ గీతం విన్నాక అమ్మ తనంలో ఎంత గొప్ప అర్థముందో వేరే చెప్పనక్కర్లేదు. అంత గొప్ప అమ్మకి ఒక రోజు కేటాయించారు మే రెండో ఆదివారాన్ని అమ్మల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. దేశ దేశాల్లో మదర్స్డేను జరుపు కోవడం ఇప్పుడు ఒక ఆనవాయితీగా మారింది. తమకు జన్మనిచ్చిన తల్లిని కాలు కింద పెట్టకుండ చూసుకునే వారి అమ్మలకు సేవ చేయడానికి ప్రత్యేకంగా ఈరోజు అక్కర్లేదు కానీ అమ్మ విశిష్టతని తెలిపేందుకే ఈ మాతృ దినోత్సవం ఏర్పాటు చేశారు. సంవత్సరంలో ఒక రోజుని మదర్స్డేగా గుర్తింపు సాధించడానికి దాదాపు 120 ఏళ్ల క్రితమే అమెరికాలో ఒక మహిళ ఏళ్ల తరబడి పోరాటం చేసింది.
అన్నా జార్వీస్ అనే మహిళ 1890 లోనే తాను నివసిస్తున్న గ్రాఫ్టన్ నగరాన్ని వదిలి ఫిలడెల్ఫియాకు మకాం మార్చుకుంది. నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లికి గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో పోరాటం సాగించింది. తన ఆశయం నెరవేరకుండానే చనిపోయిన తల్లిని గుర్తింపు కోసం మదర్స్ డే ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఆమె మదిలో కలిగింది. దీంతో తన ఆలోచనకు విస్తృతంగా ప్రాచుర్యం కల్పించే దిశగా ఆమె అడుగులు వేసింది.
తన ప్రయత్నంలో భాగంగా.. ‘మదర్స్ డే’ని అంతర్జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని జార్వీస్ తీవ్రంగా ప్రయత్నించింది. తన ఆలోచనకు మద్దతు కూడగట్టేందుకు చాలామందిని తనతో పాటు నడిపించింది. ఈ కృషి ఫలితంగానే పశ్చిమ వర్జీనియా రాష్ట్రంలో 1910లో తొలిసారి మదర్స్ డే రోజు అధికారిక సెలవుదినాన్ని ప్రకటించారు. పశ్చిమ వర్జీనియా తర్వాత అమెరికాలోని మిగతా రాష్ట్రాలు కూడా దీనిని అనుసరించాయి.
మే8, 1914న అమెరికా కాంగ్రెస్, మే నెలలోని రెండో ఆదివారాన్ని మదర్స్ డే గా ప్రకటిస్తూ ఒక చట్టం చేసింది. ఇదే విషయాన్ని మే9,1914న అప్పటి అధ్యక్షుడు వుడ్రో విల్సన్ మదర్స్ డే ను అధికారికంగా ప్రకటించారు. యుద్దంలో ప్రాణాలు కోల్పోయిన అమెరికన్ పౌరులకు నివాళులు అర్పించే రోజు గాను ఈ మదర్స్ డేను అక్కడివారు పరిగణిస్తున్నారు. క్రమక్రమంగా ఇది అంతర్జాతీయ అమ్మల దినోత్సవంగా రూపాంతరం చెందింది.