Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలంగాణ లో టీడీపీ పొత్తులతో ముందుకు వెళుతుందని అధినేత చంద్రబాబు చూచాయగా చెప్పిన మరసటి రోజే ఆ పార్టీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు గొంతు ఎత్తారు. టీడీపీ ని తెరాస లో విలీనం చేయాలంటూ గతంలో తాను చేసిన వ్యాఖ్యల మీద చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో మోత్కుపల్లి వివరణ ఇచ్చారు. విలీనం గురించి తాను అన్న మాటల మీద కాస్త వెనక్కి తగ్గిన మోత్కుపల్లి కొన్ని కీలక అంశాలు లేవనెత్తారు. ప్రస్తుతం తెలంగాణాలో పార్టీ దెబ్బ తినడానికి రేవంత్ రెడ్డి కారణం అని మోత్కుపల్లి ధ్వజం ఎత్తారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ ఇరుక్కోవడం వల్లే పార్టీ ఇప్పుడు పతనావస్థకు వచ్చిందని మోత్కుపల్లి అన్నారు. ఆ కేసులో పట్టుబడ్డప్పుడే రేవంత్ ని సస్పెండ్ చేసి ఉంటే పార్టీ పరిస్థితి బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలంగాణాలో టీడీపీ కి నాయకత్వమే ప్రధాన సమస్యగా మారిందని మోత్కుపల్లి అన్నారు. చంద్రబాబు తిరిగితేనే తెలంగాణాలో పార్టీ తిరిగి బట్టకడుతుందని మోత్కుపల్లి చెప్పారు. ఎన్టీఆర్ కింద పని చేసినట్టే, చంద్రబాబు దగ్గర కూడా పని చేశానని ఆయన తెలిపారు. ఆయన పదవి ఇచ్చినా, ఇవ్వకపోయినా తాను చంద్రబాబుకు తమ్ముడిని అని మోత్కుపల్లి చెప్పుకున్నారు. ఇంతా చెప్పి తాను లేకుండా తెలంగాణాలో పార్టీ సమావేశం జరపడం ఏంటని మోత్కుపల్లి ప్రశ్నించారు. పైగా చంద్రబాబు నమ్మిన వాళ్ళు, ఆయనతో లబ్ది పొందిన వాళ్ళే పార్టీకి నష్టం చేశారని మోత్కుపల్లి ఆరోపించారు. తెరాస తో తనకు ఏ వ్యక్తిగత వైరం లేదని కూడా ఆయన ప్రకటించారు. ఇలా ఓ వైపు చంద్రబాబుని పొగుడుతూ ఇంకోవైపు ఆయన చర్యల్ని ప్రశ్నిస్తూ మోత్కుపల్లి చేసిన కామెంట్స్ చూస్తుంటే ఆయన క్షమాపణ చెప్పారో, ధిక్కార స్వరం వినిపించారో అర్ధం కావడం లేదు.