ముఖ్యమంత్రి చంద్రబాబు మీద కొన్నాళ్ళగా తెలంగాణ నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర విమర్శలు చేస్తున్న సగంతి తెలిసిందే. నిన్న తిరుమల దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన మరో మారు బాబు మీద విరుచుకుపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌తో పాటు ఆయన వెనుకున్న ప్రతి ఒక్కరినీ చంపించిన చరిత్ర చంద్రబాబుదంటూ మోత్కుపల్లి ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు మహానేత ఎన్టీఆర్ గుర్తురారని, కేవలం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే బాబుకు ఎన్టీఆర్ బొమ్మ గుర్తొస్తుందని ఎద్దేవా చేశారు. మహాత్మాగాంధీని చంపిన గాడ్సే కంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దారుణమైన వ్యక్తి అని ఆయన అన్నారు.
నందమూరి కుటుంబం చంద్రబాబు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు ఎన్టీఆర్ గుర్తుకు రారని మండిపడ్డారు. చంద్రబాబు కాలు పెట్టిన ప్రాంతం నాశనమే అన్నారు. నేను పెద్ద మాదిగ అని చంద్రబాబు నోట దళితుల మాటే లేదని ఎద్దేవా చేశారు. కాపులు, బీసీల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుతున్నారని ఎస్సీలు, ఎస్టీలు ఎవరూ జడ్జిలు కావొద్దా చంద్రబాబు అని నిలదీశారు. తెలంగాణలో తనను అడ్డం పెట్టుకొని చంద్రబాబు బతికాడని చేపుకోచ్చారు. తనకు ఎవరి సపోర్ట్ లేదని, అందరికీ నేనే సపోర్ట్ చేస్తున్నానని చెప్పారు. ఎన్నికలకు ముందు ఏపీ ప్రజలను మభ్యపెట్టేందుకే అన్నా క్యాంటీన్లు అన్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పట్టుబడ్డాడని, రేవంత్ రెడ్డికి డబ్బులు ఇచ్చి పంపించింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ఆ కేసులో ఇద్దరూ ఉన్నారు కాబట్టే రేవంత్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదన్నారు. దళితుడ్ని కాబట్టే తనను చంద్రబాబు అవమాన పరిచాడని.. అతడిది నోరా.. తాటిమట్టా అంటూ మోత్కుపల్లి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు..