Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలంగాణ టీడీపీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలని సలహా ఇచ్చి అందరి ఆగ్రహానికి గురయిన మోత్కుపల్లి… కొన్నాళ్లు సైలెంట్ గానే ఉన్నారు. అయితే మహానాడుకు ఆహ్వానం అందకపోవడంతో… ఊహించని రీతిలో ఆయన చంద్రబాబుపై తిరుగుబాటు చేస్తున్నారు. టీడీపీ, చంద్రబాబు ప్రత్యర్థులు కూడా ఇప్పటిదాకా చేయని విధంగా సంచలన ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీ భవిష్యత్ పై కొత్త ప్రతిపాదనలు ముందుకు తెస్తున్నారు. కమ్మ కులంలో చంద్రబాబు చెడపుట్టారని మోత్కుపల్లి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నందమూరి వంశాన్ని చంద్రబాబు నాశనం చేస్తున్నారని, తెలుగుదేశం జెండా కళకళలాడాలంటే నందమూరి వారసులకే పార్టీ పగ్గాలు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. సూర్య, చంద్రులు ఉన్నంత వరకు ఎన్టీఆర్ పేరు వినపడుతూనే ఉంటుందని, ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ సరైన వ్యక్తని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు.
టీడీపీ బాధ్యతలను జూనియర్ ఎన్టీఆర్ కు ఇవ్వాలని, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా కూర్చుని దీనిపై మాట్లాడాలని సూచించారు. ఎన్టీఆర్ ఆశీర్వాదం వల్లే తాను రాజకీయాల్లో ఉన్నానని, తన రాజకీయ జీవితాన్ని బలిచేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు తాను అండగా ఉన్నానని, ఇప్పుడు కనీసం మహానాడుకు కూడా ఆహ్వానించలేదని, ఎన్టీఆర్ పార్టీకి తనను దూరం చేశారని కన్నీళ్లు పెట్టుకున్నారు. చంద్రబాబుకు పాలించే అర్హత లేదని, ఎన్టీఆర్ పేరును రాజకీయప్రయోజనాల కోసమే చంద్రబాబు వాడుకుంటున్నారని ఆరోపించారు. ఏపీలో వైసీపీ అధినేత జగన్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేతులు కలిపితే టీడీపీకి డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కూడా చంద్రబాబు కుట్ర చేశారని, అయితే కేసీఆర్ తెలివైన వాడు కావడంతో చంద్రబాబు ప్రయత్నాన్ని అడ్డుకోగలిగారని అన్నారు.
తెలంగాణలో కీలక నేతలందరినీ ఎన్టీఆరే తయారుచేశారని, కేసీఆర్ కూడా ఎన్టీఆర్ శిష్యుడేనని… ఆయనకు తాను ఓ విన్నపం చేస్తున్నానని, ఎన్టీఆర్ కోసం ఒక స్థూపం ఏర్పాటుచేయాలని కోరారు. అటు మోత్కుపల్లి వ్యాఖ్యలపై టీటీడీపీ నేత సండ్ర వెంకట వీరయ్య మండిపడ్డారు. గవర్నర్ పదవి ఇవ్వకపోవడం వల్లే చంద్రబాబుపై మోత్కుపల్లి విషం చిమ్ముతూ సంస్కార హీనంగా విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అప్పట్లో తెలంగాణ సీఎం కేసీఆర్ ను విమర్శించిన మోత్కుపల్లికి ఇప్పుడాయన దేవుడిగా కనపడుతున్నారా అని నిలదీశారు. టీడీపీలో ఉంటూనే కేసీఆర్, జగన్, పవన్ ను పొగుడుతున్నారని, ఆయన వెనక ఎవరున్నారో తమకు తెలుసని అన్నారు. మోత్కుపల్లి లాంటి దుర్మార్గుణ్ని టీడీపీ కార్యకర్తలెవరూ దగ్గరకు రానీయకూడదని, మనిషిగా ఆయన ఎప్పుడో చచ్చిపోయాడని సండ్ర తీవ్ర వ్యాఖ్యలు చేశారు.