Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భారత క్రికెట్ చరిత్రలో మహేంద్రసింగ్ ధోనిది ఓ శకం అని చెప్పొచ్చు. భారత క్రికెట్ పై ఆయన వేసిన గుర్తులు కొన్ని దశాబ్దాల పాటు నిలిచిపోతాయి. ధోనీ సారధ్యంలో భారత క్రికెట్ సాధించని ఘనత లేదు. తొలి టీ 20 కప్పును గెలుచుకుంది. ఆ తర్వాత టెస్టుల్లో నెంబర్ వన్ ర్యాంకు సొంతం చేసుకుంది. మరికొన్నిరోజులకు భారత అభిమానుల చిరకాల స్వప్నమైన వన్డే ప్రపంచకప్ గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ధోనీ కెప్టెన్సీలో వెలితిలేకుండా చాంపియన్స్ ట్రోఫీని సైతం ఆయన నేతృత్వంలోనే భారత్ కైవసం చేసుకుంది. కెప్టెన్ గానే కాదు… వికెట్ కీపర్ గానూ, బ్యాట్స్ మెన్ గానూ ధోనీ ఎన్నో ఘనతలు సాధించాడు. ఇప్పుడు అన్ని ఫార్మట్లలో కెప్టెన్సీకి గుడ్ బై చెప్పి జట్టులో కేవలం ఓ ఆటగాడిగా కొనసాగుతున్న ధోనీ.
భారత్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. కెప్టెన్సీ ఒత్తిడి తొలగిపోవడంతో స్వేచ్ఛగా బ్యాట్ ఝుళిపిస్తున్నాడు. మరికొన్నాళ్లు ధోనీ ఇదే ఫాంతో దేశానికి ప్రాతినిధ్యం వహించగలడని కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రితో సహా ఎందరో నమ్ముతున్నారు. ఇలాంటి తరుణంలో ధోనీని సరైన రీతిలో గౌరవించాలని బీసీసీఐ సైతం ఆలోచిస్తోంది. అందుకే ధోనీ పేరును పద్మభూషణ్ అవార్డుకు నామినేట్ చేసింది. ఈసారి కేవలం ధోనీ పేరును మాత్రమే పద్మ అవార్డులకు పంపించినట్టు బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. బీసీసీఐ ప్రతిపాదనకు కేంద్ర అంగీకరిస్తే జార్ఖండ్ డైనమట్ ఇకపై పద్మభూషణ్ ధోనీ అవుతాడన్నమాట. ధోనీ 2009లోనే పద్మశ్రీ అందుకున్నాడు.