వెస్టిండీస్‌ టూర్‌కు ధోనీ దూరం..ఇప్పుడే రిటైరవ్వట్లేదు!

ms dhoni pulls out of west indies tour

వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లే భారత క్రికెట్‌ జట్టును బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఆదివారం ఎంపిక చేయనుంది. మాజీ కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ ఎంపికపై కొద్దిరోజులుగా సందిగ్థత నెలకొంది. ధోనీ భవితవ్యంపై సెలక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనేది ఉత్కంఠగా మారింది. ఐతే తాజాగా ధోనీ స్పష్టతనివ్వడంతో సెలక్టర్ల పని ఈజీ అయింది. కరీబియన్‌ టూర్‌లో పరిమిత ఓవర్ల క్రికెట్‌కు తాను అందుబాటులో ఉండట్లేదని ఏకంగా ధోనీనే వెల్లడించినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.

‘బీసీసీఐ ఉన్నతాధికారిని మహేంద్రసింగ్‌ ధోనీ వ్యక్తిగతంగా కలిసి వెస్టిండీస్‌ టూర్‌కు ఎందుకు దూరమవుతున్నాననే విషయాన్ని సమగ్రంగా వివరించాడు. టెరిటోరియల్‌ ఆర్మీ పారాచూట్‌ రెజిమెంట్‌లో ధోనీ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో కొనసాగుతున్నాడు. మూడు విషయాలపై క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాం. క్రికెట్‌కు ధోనీ ఇప్పుడే వీడ్కోలు పలకట్లేదు. పారామిలటరీ రెజిమెంట్‌లో సేవలందించేందుకు రెండు నెలల సెలవు మాత్రమే తీసుకుంటున్నాడు. ప్రపంచకప్‌ కన్నా ముందే మహీ దీనిపై నిర్ణయానికి వచ్చాడు. ఇదే విషయాన్ని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో పాటు సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌కు తాము తెలియజేశామని’ బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు.