Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
లోక్ సభలో టీడీపీ అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు టార్గెట్ గా ఢిల్లీ నుంచి గల్లీ దాకా వివిధ రాజకీయ పార్టీలు నానా ఎత్తులు వేస్తున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్, వైసీపీ అధినేత జగన్, ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ రామ్ మాధవ్ ఇలా అంతా డైరెక్ట్ గా చంద్రబాబు మీద యుద్ధం చేస్తుంటే తీర్మానం లోక్ సభలో చర్చకు రాకుండా చూస్తూ తెరాస అధినేత, తెలంగాణ సీఎం కెసిఆర్ పరోక్ష యుద్ధం చేస్తున్నారు. ఇక తాను ఏ పార్టీకి చెందని వాడిని అని చెప్పుకునే ఉండవల్లి సైతం అవిశ్వాస తీర్మానం లోక్ సభలో చర్చకు రాకపోతే అది చంద్రబాబు వైఫల్యం అని చెప్పడం తో ఆగకుండా అదే జరిగితే ఏపీ లో టీడీపీ మూడో స్థానానికి పడిపోతుందని తన మనసులో కోరిక బయటపెట్టుకున్నారు. ఈ అందరూ చంద్రబాబుని టార్గెట్ చేయడం చూస్తున్న టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా సపోర్ట్ తో ఈ దాడిని సమర్ధంగా ఎదుర్కొంటున్నాయి.
అయితే ఈ క్రమంలో టీడీపీ సోషల్ మీడియా బృందానికి ఓ పెద్ద డౌట్ వచ్చిందట. చీమ చిటుక్కుమన్నా చంద్రబాబు మీద విమర్శలు చేయడానికి రెడీ అయిపోయే కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఎక్కడికి వెళ్లిపోయాడో వారికి అర్ధం కావడం లేదట. సహజంగా ఇంత మంచి అవకాశాన్ని ముద్రగడ ఎందుకు మిస్ చేసుకుంటున్నారో అని వాళ్ళు తెగ ఆలోచన చేస్తున్నారు. మాములుగా కష్ట సమయంలో ఎవరు ఆదుకుంటారా అని ఎదురు చూడడం సహజం. కానీ కష్టాన్ని ఇంకాస్త పెంచే వాళ్ళు ఇంకా ఎందుకు రంగంలోకి దిగలేదా అని ఆలోచించడం ఆశ్చర్యకరమే.