కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇంకో సంచలనానికి తెర లేపారు. కాపు రిజర్వేషన్ ఉద్యమం పేరుతో చంద్రబాబు సర్కార్ ని నిత్యం టార్గెట్ చేసిన ఆయన ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని తక్కువ చేసే కామెంట్స్ చేశారు. టీడీపీ సర్కార్ కాపు రిజర్వేషన్ ల మీద నిర్ణయం తీసుకున్నాక సైలెంట్ అయిపోయిన ముద్రగడ హఠాత్తుగా నెల్లూరు జిల్లాలో ప్రత్యక్షం అయ్యారు. ఈ టూర్ ఉద్దేశం బయటకు చెప్పకపోయినా ఆయన అక్కడ వెంకటగిరి రాజా కుటుంబీకులతో కలిశారు. ఆ భేటీ పరమార్ధం ఏమిటో బయటకు రాకపోయినా వెంకటగిరి రాజులు ఒకప్పుడు టీడీపీ లో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే రెండు సార్లుగా కురుగుండ్ల రామకృష్ణ కి టీడీపీ టికెట్ ఇవ్వడంతో రాజాలు సైలెంట్ అయ్యారు. ఇప్పుడు వారితో ముద్రగడ భేటీ ఆశ్చర్యం కలిగిస్తోంది. వైసీపీ దూతగా ఏమైనా ముద్రగడ అక్కడికి వచ్చారేమో అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
ఈ వ్యవహారం ఒక ఎత్తు అయితే పవన్ కళ్యాణ్ గురించి అక్కడకు వచ్చిన విలేకరులతో ముద్రగడ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ముద్రగడ ని పవన్ గురించి ప్రశ్నించినప్పుడు ఆయన ఎవరో తనకు తెలియదు అని బదులివ్వడం చూస్తే పాత కోపాలు బయటపడ్డాయి. పైగా అదేంటని ఇంకోసారి అడిగితే ఆయనతో తనకు పరిచయం లేదని కూడా ముద్రగడ జవాబు ఇచ్చారట. ఈ వ్యవహారం చూస్తుంటే వైసీపీ కి వ్యతిరేకంగా పవన్ రాజకీయ ప్రయాణం సాగడం ముద్రగడకి ఏ మాత్రం నచ్చడం లేదని అందుకే ఆయన ఇలా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. ఈ కామెంట్స్ తో పవన్ కి వచ్చిన నష్టం ఏమీ లేదు గానీ వైసీపీ తో ముద్రగడ బంధం ఇంకోసారి బయటపడింది. ముద్రగడ ఇంత బహిరంగంగా వైసీపీ కోసం తాపత్రపడుతున్నప్పుడు ఆ పార్టీ లో అధికారికంగా చేరితే బాగుంటుంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.