Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో సుదీర్ఘ కాలం తనదైన బ్రాండ్ వేసిన మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ సొంత ఇంటిలో మాత్రం నెగ్గుకురాలేకపోతున్నారు. ఇంతకుముందే పెద్దకొడుకు అఖిలేష్ సింగ్ యాదవ్ తండ్రి నుంచి బలవంతంగా సమాజ్ వాదీ పార్టీ పగ్గాలు లాగేసుకున్నారు. అప్పట్లో ఆ ఇంటి గొడవ అఖిలేష్ , ఆయన సవతి సోదరుడు ప్రతీక్ మధ్య వారసత్వ పోరుకు అద్దం పట్టింది. అయితే ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పనిచేసిన అనుభవంతో అఖిలేష్ తేలిగ్గా పార్టీ పగ్గాలు కైవసం చేసుకొన్నాడు. ములాయం తన రెండో భార్య, ఆమె కుమారుడు , సొంత సోదరుడు చెప్పినట్టు విని సమాజ్ వాదిని భ్రష్టుపట్టిస్తున్నారని అఖిలేష్ చెప్పిన మాటలు పార్టీ శ్రేణులు నమ్మాయి. అందుకే ములాయం ని పక్కనబెట్టిన అఖిలేష్ మీద పార్టీ వర్గాల్లో పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కాలేదు. పెద్ద కొడుకు కొట్టిన దెబ్బ నుంచి పూర్తిగా కోలుకోని ములాయం కి చిన్నకొడుకు, కోడలు కూడా షాక్ ఇస్తున్నారు.
యూపీ లో బీజేపీ అంటే మండిపడే ములాయం చిన్నకొడుకు, కోడలు అక్కడ కమలం ప్రభుత్వం ఏర్పడ్డ వారంలోపే సీఎం యోగి ఆదిత్యనాథ్ ని కలిసి వచ్చారు. అదేదో మర్యాదపూర్వక భేటీ అనుకుంటే ఇప్పుడు ఏకంగా సైద్ధాంతిక అంశాల్లోనే మామకు షాక్ ఇస్తోంది ములాయం చిన్నకోడలు అపర్ణ. పార్లమెంట్ లో ట్రిపుల్ తలాక్ బిల్లు లో సవరణలు కావాలని ములాయం అంటుంటే, ముస్లిం మహిళల సమస్యకు ఆ బిల్లు చక్కటి పరిష్కారంగా అపర్ణ అభిప్రాయపడుతున్నారు. అసలే సున్నితమైన ఈ వ్యవహారంలో కోడలు కూడా బీజేపీ విధానానికి మద్దతుగా నిలవడంతో ములాయం మింగలేక, కక్కలేక ఇబ్బందిపడుతున్నారు. ములాయం ఇంటి వ్యవహారం చూస్తుంటే ఇకపై ప్రాంతీయ పార్టీల్లోనూ భిన్నాభిప్రాయాలకు చోటు తప్పదు అనిపించడం లేదూ!