అయ్యో రజని… తమిళుల ముందు కన్నడ పురాణమా?

rajinikanth political speech about kannada at chennai

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

రాజకీయ రంగ ప్రవేశ ప్రకటనకు ఒక్క రోజు దూరంలో వున్న తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఓ నిజం చెప్పారు. ఆ నిజాన్ని తమిళులు ఎలా అర్ధం చేసుకుంటారు అనే దాని మీదే ఆయన రాజకీయ భవితవ్యం ఆధారపడి వుంది. చెన్నైలో అభిమానులతో ఐదు రోజులుగా సమావేశం అవుతున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఆయన తన గతాన్ని వివరించారు. తాను బెంగుళూరు లో కన్నడ మీడియం లో చదువుకున్నట్టు చెప్పారు. ఇక తన ఇంటి లో అంతా కన్నడ మాట్లాడతారని, బెంగళూరు లోనే కండక్టర్ గా ఉద్యోగం కూడా వచ్చిందని రజని వివరించారు. అయితే కన్నడతో అంత సంబంధం పెనవేసుకున్న తనకు తమిళులు నటుడిగా కొత్త జీవితం ఇచ్చారని చెప్పారు. బాలచందర్ చెప్పడం వల్లే తాను తమిళ్ నేర్చుకున్నట్టు రజని వివరించారు. ఇవన్నీ నిజాలే అయినా కావేరి నదీజలాల విషయంలో కర్ణాటకతో ఢీకొంటున్న తమిళ ప్రజలు ఈ వ్యవహారాన్ని ఎలా తీసుకుంటారో అని రజని సన్నిహితులు టెన్షన్ పడుతున్నారు. అసలే తమిళుల భాషాభిమానం, సంస్కృతి మీద వారికున్న ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

రజని వ్యాఖ్యల మీద పెద్ద దుమారమే రేగే అవకాశం వుంది. ఒకవేళ ప్రజలు ఊరుకున్నా పార్టీలు చూస్తూ ఊరక ఉంటాయి అనుకోవడం పొరపాటు. రజని కూడా ఇదంతా తెలిసి చేశారు అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. పార్టీ అనౌన్స్ చేసాక ఎటూ ఈ విమర్శలు వస్తాయి కాబట్టి ముందుగానే వాటికి సమాధానం ఇవ్వడం రజని ఉద్దేశం అనిపిస్తోంది. అయితే ఒకటిరెండు సార్లు వివరణలు ఇస్తే సరిపోయేంత చిన్న విషయం ఇది కాకపోవచ్చు. అయినా పార్టీ పెట్టే ఉద్దేశం, విమర్శలకి ఎదురు నిలబడే ధైర్యం వుంది కాబట్టే కన్నడ అంశానికి రజని అంత ప్రాముఖ్యం ఇచ్చారని ఆయన ఫాన్స్ వాదన. మొత్తానికి డిసెంబర్ 31 , 2017 రజని జీవితంలో తమిళ రాజకీయాల్లో ఓ కీలక ఘట్టంగా మిగిలిపోనుంది.