సాధారణంగా రోడ్డుపై వెళ్తున్నప్పుడు మనం గమనిస్తే కొంతమంది లిఫ్ట్ అడుగుతుంటారు. సాధారణంగా అయితే చాలామంది ఎక్కించుకోరు వందలో ముగ్గురో నలుగురో పోనీలే పాపం అని బైకో, కారో ఎక్కించుకుంటారు. అయితే ఇకపై మీరు అలా చేశారో మీరు కష్టాలు కొని తెచ్చుకున్నట్లే. అదేంటని షాకవ్వకండి. మనకు తెలియని వ్యక్తులకు లిఫ్ట్ ఇవ్వడం నేరమట. దీనికి ఫైన్ కూడా కట్టాల్సిందేనని చట్టాలు చెబుతున్నాయట. ఫైన్‌తో పోతే ఫర్వాలేదు ఒక్కోసారి అంతకంటే ఎక్కువ శిక్ష పడే ప్రమాదం ఉందని కూడా ఉందట. మంచికిపోతే చెడు ఎదురయినట్టు ఇదేం ఖర్మరా బాబు అనుకుంటున్నారా నిజమే మరి. పాపం ఓ వ్యక్తి అలాగే తెలియని వాళ్లకు లిఫ్ట్ ఇచ్చి ఫైన్ కట్టాడు.
అసలు విషయానికొస్తే… ఈ వారం క్రితం ముంబైకి చెందిన నితిన్ నాయర్ తన కారులో ఇంటికి బయల్దేరాడు. ఐరోల్ సర్కిల్ దగ్గరకు రాగానే జోరున వాన కురుస్తోంది. ఎదురుగా బస్టాండ్‌లో ముగ్గురు వ్యక్తులు నిలబడి ఉన్నారు. వారిని చూసి జాలి వేయడంతో నితిన్ తన కారులో ఎక్కించుకున్నాడు. ఈ సీన్ మొత్తాన్ని చూసిన ఓ కానిస్టేబుల్ నేరుగా కారు దగ్గరకు వచ్చాడు. చలానా తీసి రాసిచ్చి చేతిలో పెట్టాడు. ఫైన్ కట్టాలని చెప్పడంతో… అతడు షాకయ్యాడు. అతడి లైసెన్స్ కూడా తీసుకొని మరుసటి రోజు పోలీస్ స్టేషన్‌కు రావాలన్నాడు.
అయితే అప్పటికే ఆ ముగ్గుర్ని ఎక్కించుకొని నితిన్ వారు వెళ్లాల్సిన ప్రాంతంలో దించేశాడు. మరుసటి రోజు పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా… వారు కోర్టుకు హాజరుకావాలని చెప్పారు. అక్కడ జడ్జి ముందు హాజరుకాగా… రూ.1500 ఫైన్ కట్టించి లైసెన్స్ అప్పగించారు. తర్వాత ఆరా తీసిన నితిన్‌కు మోటార్ వెహికల్ చట్టంలోని 66/192 ప్రకారం అజ్ఞాత వ్యక్తులకు లిఫ్ట్ ఇవ్వడం నేరమట… అందుకే జరిమానా విధించారట. దీంతో తనకు ఎదురైన అనుభవాన్ని అతడు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.
ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు షాకవుతున్నారు… అలాగే తమ అసంతృప్తిని తెలియజేస్తున్నారు. తోటి మనిషికి సాయం చేయడం కూడా తప్పేనా అని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు కూడా ఈ ఘటనపై స్పందించారు. తోటి మనుషులకు సాయం చెయ్యడంలో తప్పు లేదని… అయితే తెలియని వ్యక్తుల్ని వాహనంలోకి ఎక్కించుకోవడం నేరమంటున్నారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితి అయితే ఆ వ్యక్తుల గురించి తెలుసుకొని… లిఫ్ట్ ఇచ్చినందుకు డబ్బు కూడా తీసుకోవాలని చెబుతున్నారు. సో రోడ్డుపై ఎవరికైనా లిఫ్ట్ ఇచ్చే ముందు ఓసారి ఆలోచించుకోండి మరి.