గీతం కళాశాలల వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంవీవీఎస్ మూర్తి మృతి చెందిన విషయం బుధవారం ఉదయమే తెలిసినా గీతం డీమ్డ్ వర్సిటీకి సెలవు ప్రకటించలేదు. దీంతో ఈ విషయం తెలిసిన అందరూ దాదాపు ఆశ్చర్యంలో మునిగిపోయారు. వ్యవ్యస్థాపక అధ్యక్ష్యుడు చనిపోతే పట్టించుకోకుండా ఇలా కళాశాలలు తెరవడం ఏమిటని. కానీ దీనికి బలమైన కారణం ఉందని వర్సిటీ వర్గాలు తెలియజేశాయి.
ఏడాది క్రితం మూర్తి అధ్యక్షతన వర్సిటీలో జరిగిన సమావేశంలో ఓ కార్యక్రమం కోసం గీతం డీమ్డ్ వర్శిటీకి ఒక రోజు సెలవు ప్రకటించాలని కొంతమంది ఆయన ముందు ప్రతిపాదించారు. దీనికి ఆయన ఈ కార్యక్రమానికే కాదు ‘ఇప్పుడే కాదు నేను చనిపోయినా వర్సిటీకి సెలవు మాత్రం ఇవ్వవొద్దని ఆయన చెప్పారు. దీంతో ఆయన ఆరోజు చెప్పిన మాట ప్రకారం బుధవారం వర్సిటీకి సెలవు ఇవ్వకుండా మధ్యాహ్నం వరకు తరగతులు కొనసాగించారు. ఆపై వీసీతో పలువురు సమావేశమై మధ్యాహ్నం ఒక్కపూటే సెలవు ప్రకటించారని తెలుస్తోంది.