ITC కాకతీయ హోటల్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాపు వ్యాపారవేత్తలతో సీక్రెట్ మీటింగ్ జరిపారన్న కధనాన్ని మహా టీవీ ప్రసారం చేసాక అందులో కీలక పాత్ర వహించిన జర్నలిస్ట్ మూర్తి ఉద్యోగం పోయింది. ఈ కథనానికి సంబంధించి బయట నుంచి మేనేజ్ మెంట్ మీద వచ్చిన ఒత్తిళ్లతో పాటు 400 మంది ఉద్యోగుల భవిష్యత్ ని దృష్టిలో ఉంచుకుని తానే ఛానల్ నుంచి బయటకు వచ్చినట్టు మూర్తి తాజాగా ఓ యు ట్యూబ్ ఛానల్ ద్వారా వివరించాడు. ఓ 4 రోజుల పాటు మూర్తి మహా ఛానల్ లో కనిపించకపోవడం తో పవన్ ఫాన్స్ పండగ చేసుకున్నారు. అయితే ఆ సంతోషం ఎక్కువ కాలం కొనసాగకముందే మూర్తి మళ్ళీ ఓ యు ట్యూబ్ ఛానల్ ద్వారా సీన్ లోకి ఎంటర్ అయిపోయాడు.
జన సైనికుల చేతిలో ఎదురు దెబ్బ తిన్న మూర్తి ఇక సైలెంట్ అయిపోతాడని చాలా మంది భావించారు. అయితే మరింత వేగంతో మూర్తి దూసుకొచ్చాడు. సోషల్ మీడియాలో తనను ట్రోలింగ్ చేస్తున్న పవన్ ఫాన్స్ విమర్శలకు ఘాటుగా సమాధానం ఇవ్వడంతో పాటు మహా టీవీ లో ఐటీసీ కాకతీయ మీటింగ్ కి సంబంధించి ఇచ్చిన కధనాన్ని పూర్తిగా సమర్ధించుకున్నాడు. అంతటితో ఆగితే ఏమో గానీ ఓ పెద్ద బాంబు పేల్చాడు. మీటింగ్ జరిగిన ప్రాంతానికి తాను వేరే రూపంలో వెళ్లినట్టు మూర్తి చెప్పాడు. దాంతో పాటు అసలు మీటింగ్ లో పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర నాయకులు మాట్లాడిన ప్రసంగాలకి సంబంధించిన దృశ్యాలు తన దగ్గర ఉన్నట్టు మూర్తి వివరించాడు.
పవన్ మీద వున్న అభిమానంతో వాటిని బయటపెట్టలేదని , పెట్టే ఆలోచన కూడా లేదని మూర్తి వివరించాడు. ఇక పవన్ మీటింగ్ తర్వాత ఖాళీ అయిన అదే వేదిక నుంచి మూర్తి పీటీసీ కూడా ఇచ్చారు. ఆ దృశ్యాల్ని మాత్రం మూర్తి యు ట్యూబ్ ఛానల్ ద్వారా బయటపెట్టాడు. మొత్తానికి మూర్తి మాటలతో కాకతీయ హోటల్ మీటింగ్ కి చెందిన పవన్ ప్రసంగం గుట్టు ఇప్పుడు మూర్తి చేతిలో ఉందన్న విషయం జనసైనికులకు చేరిపోయింది. దీని ద్వారా తనను ఇంకా కెలికితే మీకే నష్టం అని మూర్తి జనసేనకు ఓ యు ట్యూబ్ ఛానల్ ద్వారా హెచ్చరిక ఇచ్చాడన్నమాట.