హైదరాబాద్‌లో ఓ ప్రేమోన్మాది యువతి గొంతు కోసి తానూ కోసుకున్న ఘటన జరిగి రెండ్రోజులు కూడా కాక మునుపే చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలో అలాంటిదే మరో దారుణం జరిగింది. ఓ వివాహితను గుర్తు తెలియని వ్యక్తి గొంతు కోసి హత్య చేశాడు. వివాహిత ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. మదనపల్లెలోని తారకరామ థియేటర్ సమీపంలో నిన్న రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మృతురాలిని తహసీన్(32)గా గుర్తించారు. ఆమె భర్త స్థానిక మసీదులో మత పెద్ద. అయితే హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చి పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. దంపతుల మధ్య వివాదాలేవైనా ఉన్నాయా అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేశారు. వివాహితను ఇంట్లోనే అతి దారుణంగా గొంతు కోసి చంపిన వార్త వెలుగులోకి రావడంతో మదనపల్లి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. హత్య ఒక్కడే వ్యక్తి చేశాడా, ఒకడి కంటే ఎక్కువ మంది పాల్గొన్నారా అనే దాని మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని నిందితులను అతి త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.