Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయిక రంజనా్ మాసం. ఈ నెలలో ముస్లింలు విధిగా పాటించే ఓ నియమం తమ సంపాదనలో కొంత మొత్తం దానధర్మాలకు కేటాయించడం. సంపన్నులు, సంపాదనాపరులు రంజాన్ నెలలో జకాత్ ఆచరించాలని ఖురాన్ బోధిస్తోంది. తమ ఆస్తిలో నుంచి కొంత మొత్తాన్ని పేదలకు దానం చేయడాన్ని జకాత్ అంటారు. దీని ప్రకారం ధనికులు ధన, వస్తు, కనక రూపంలో దానధర్మాలు చేస్తారు. పేదవారు కూడా అందరితో పాటు పండుగ జరుపుకోటానికి, సంతోషంగా ఉండడానికే ఈ జకాత్ నియయం. జకాత్ తో పాటు ఫిత్రా దానానికి రంజాన్ నెలలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఉపవాసవ్రతాలు విజయవంతంగా ముగిసినందకు, దేవుడి పట్ల కృతజ్ఞతగా పేదలకు ఈ ఫిత్రాదానం విధిగా అందిస్తారు.
50 గ్రాములు తక్కువ రెండు కిలోల గోధుమలు గానీ, దానికి సమానమైన ఇతర ఆహారధాన్యాలు గానీ, దానికి సమానమైన ధనాన్ని గానీ పంచిపెడతారు. కుటుంబంలోని సభ్యులందరి తరపున పేదలకు అందజేసే ఈ దానం వల్ల సర్వపాపాలూ తొలగిపోయి పుణ్యం దక్కుతుందనేది ముస్లింల నమ్మకం. ఇక రంజాన్ మాసంలో మరో ప్రత్యేకత… 27వ రోజు రాత్రి జరిగే షబ్-ఎ-ఖదర్ ఉత్సవం. ఈ రాత్రిని ముస్లింలు వెయ్యి రాత్రుల కంటే పుణ్యప్రదమైనదిగా భావిస్తారు. రాత్రంతా జాగరణ చేస్తూ అల్లాను ప్రార్థిస్తారు. షబ్ ఏ ఖదర్ రోజు జాగరణ చేస్తే 83 సంవత్సరాలు పాటు ప్రార్థనలు చేసిన ఫలం దక్కుతుందన్నది నమ్మకం.
దివ్య ఖురాన్ ఈ రోజే అవతరించిందన్నది ముస్లింలు విశ్వసిస్తారు. షబ్ -ఎ-ఖదర్ రాత్రి వాతావరణం చల్లగా, వేడిగా ఉండకుండా సమతుల్యంగా ఉంటుందని, రాత్రి పూట కుక్కలు మొరగవని, మరుసటి రోజు సూర్యుడు పెద్దగా కనిపిస్తాడని మత పెద్దలు చెబుతారు. ఈ రాత్రి జాగరణలో ముస్లింలు చేసే ప్రార్థనలు మెచ్చి అల్లా వారి పాపాలను పూర్తిగా క్షమించడమే కాకుండా కోర్కెలు తీరుస్తాడన్నది కూడా ముస్లింల విశ్వాసం. ఏడాదంతా తన కోసం జీవించే మనిషి…ఒక నెల దైవచింతనలో గడపడం కూడా రంజాన్ మాసం ఉద్దేశం. నెలవంక దర్శించన తర్వాతిరోజు నుంచి రంజాన్ మాసం ఆచరించే ముస్లింలు, నెలపొడుపుతో ఉపవాసదీక్షలు విరమించి మరుసటి రోజు రంజాన్ పండుగ జరుపుకుంటారు.