అమెరికా, ఉత్తరకొరియా మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్నాయే తప్ప చల్లారే సూచనలు కనిపించడం లేదు. ఇప్పటిదాకా ఆ రెండు దేశాలే మాటల యుద్ధం సాగిస్తుండగా… తాజాగా ప్రపంచ దేశాలను ఇందులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రపంచ దేశాల పార్లమెంట్లకు ఉత్తరకొరియా తాజాగా లేఖలు రాసింది. అమెరికాపై ఆ లేఖల్లో అనేక ఫిర్యాదులు చేసింది. ఉత్తరకొరియాపై యుద్ధం మొదలుపెట్టామని, అన్ని దేశాలూ మద్దతు పలకాలని కోరుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే అన్ని దేశాలకూ ఓపెన్ లెటర్ రాశారని ఉత్తరకొరియా పార్లమెంటు కమిటీ ఆరోపించింది.
ఉత్తరకొరియాపై తీవ్రమైన కక్ష పెంచుకున్న ట్రంప్ ఈ రకమైన వేధింపులకు పాల్పడుతున్నాడని, ఐక్యరాజ్యసమితిలో ఉత్తరకొరియాను సర్వ నాశనం చేస్తామని ట్రంప్ చేసిన ప్రసంగమే ఇందుకు నిదర్శనమని, ఈ విషయాన్ని ప్రపంచ దేశాలు గుర్తించాలని లేఖల్లో కోరింది. తన ప్రతిజ్ఞను నిజం చేసేందుకు ట్రంప్ నడుంబింగించారని ఆరోపించిన ఉత్తరకొరియా తాము అమెరికాకు తలవంచే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. తమపై దాడికి దిగితే ఉత్తరకొరియా హైడ్రోబన్ బాంబు పవరేంటో అమెరికా రుచిచూడాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరించింది. మరోవైపు అమెరికా ఉత్తరకొరియాపై దాడిచేస్తున్నట్టుగా ఉన్న ఓ వీడియోను ఆ దేశ మీడియా ప్రసారం చేసింది.
అధ్యక్షుడు కిమ్ ను ట్రంప్ రాకెట్ మ్యాన్ అన్న వ్యాఖ్యలు వీడియోలో ప్రసారమయ్యాయి. అనంతరం తమ దేశంపైకి దూసుకొస్తున్న అమెరికా క్షిపణులు, బాంబర్లు, జెట్ విమానాలను ఉత్తరకొరియా పేల్చేసిన దృశ్యం కనిపించింది. ఉత్తరకొరియాపై దాడి అనే దుస్సాహసానికి అమెరికా పూనుకుంటే ఆ దేశం బూడిద కావాల్సిందే నంటూ కిమ్ ప్రభుత్వం ఈ వీడియోలో హెచ్చరించింది. అమెరికా యుద్ధ విమానాలు ఉత్తరకొరియా సరిహద్దులకు అతి సమీపంలో ప్రయాణించిన నేపథ్యంలో ప్రజల్లో భయాందోళనలు తలెత్తకుండా ఉండేందుకే ఆ దేశ మీడియా ఈ వీడియోను ప్రసారంచేస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి.