Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సంక్రాంతికి విడుదలవుతుందనుకున్న మహేష్‌బాబు ‘భరత్ అను నేను’ చిత్రాన్ని వచ్చే సంవత్సరం ఏప్రిల్ 27న విడుదల చేయబోతున్నట్లుగా తాజాగా నిర్మాత దానయ్య ప్రకటించిన విషయం తెల్సిందే. కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అయ్యిందని, దర్శకుడు కొరటాల శివ మంచి ఔట్‌పుట్‌ను ఇస్తున్నాడు అంటూ నిర్మాత చెప్పుకొచ్చాడు. భారీ అంచనాలున్న ఈ చిత్రం సమ్మర్‌కు సందడి చేయడం ఖాయం అంటూ మహేష్‌బాబు ఫ్యాన్స్‌తో పాటు, సినీ వర్గాల వారు కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు. కాని ‘భరత్ అను నేను’ చిత్రం మరియు అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ చిత్రం ఒకే రోజు విడుదల కాబోతుండటం కాస్త టెన్షన్‌కు గురి చేస్తోంది.
అల్లు అర్జున్, వక్కంతం వంశీల కాంబో చిత్రం ‘నాపేరు సూర్య’ను సమ్మర్‌లో విడుదల చేస్తామని మూడు నాలుగు నెలల క్రితమే ప్రకటించారు. ఆ విషయం తెలిసి మహేష్ మూవీ డేట్ ఫిక్స్ చేశారో లేక తెలియక చేశారో కాని ఒకే రోజు విడుదల అయ్యేలా ప్లాన్ చేశారు. ఏప్రిల్ 27న మహేష్‌బాబు, అల్లు అర్జున్‌లు రాబోతున్నారు. ఇటీవల రెండు పెద్ద హీరోల సినిమాలు ఒకే రోజున విడుదలైన సందర్బాలు లేవు. కనీసం వారం గ్యాప్‌లో అయినా విడుదల అవుతున్నాయి. దాంతో ఈ రెండు కూడా ఖచ్చితంగా విడుదల సమయానికి డేట్లు మారే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. కాని పరిస్థితి చూస్తుంటే సినిమా విడుదల తేదీలు మారే అవకాశాలు కనిపించడం లేదు.
మహేష్ ఫిక్స్ అయిన కారణంగా వారం ముందు లేదా తర్వాత అల్లు అర్జున్ సినిమా విడుదల చేస్తారని అంతా భావించారు. కాని తాజాగా ఆ సినిమా నిర్మాతలు స్పందిస్తూ తాము డేటు మార్చితే భయపడి మార్చామనే తప్పుడు సంకేతం ప్రేక్షకుల్లోకి వెళ్తుందని, అందుకే తాము డేటు మార్చదల్చుకోలేదు అంటూ చెప్పుకొచ్చారు. బన్నీ అనుకున్న డేట్‌కు వస్తున్న నేపథ్యంలో మహేష్ బాబు నిర్మాతలు ఏమైనా డేటు మార్చే అవకాశం ఉందా అనే విషయం చూడాలి. రెండు సినిమాలు ఒకే రోజు విడుదలైతే ఖచ్చితంగా రెండు సినిమాలకు నష్టమే అని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. ప్రస్తుతం సినిమాలు అన్ని కూడా ఓపెనింగ్ కలెక్షన్స్‌పై ఆధారపడుతున్నాయి. రెండు ఒకేరోజు విడుదలైతే ఓపెనింగ్ కలెక్షన్స్ భారీగా తగ్గే అవకాశం ఉంటుంది. మరి ఈ పరిస్థితి నుండి ఎలా బయట పడతారు అనేది చూడాలి.