మెగా బ్రదర్ నాగబాబు జనసేన పార్టీలో చేరారు. ఇన్నాళ్లుగా సోషల్ మీడియా వేదికగా తన వాయిస్ వినిపిస్తున్న నాగబాబు ఇప్పుడు నేరుగా ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. విజయవాడలోని జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో నాగబాబు ఆ పార్టీలో చేరారు. తన అన్నయ్య నాగబాబుకు పార్టీ కండువా వేసి పవన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నాగబాబు మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. పవన్ తనకు పేరుకు తమ్ముడు కావొచ్చుగానీ అందరు కార్యకర్తల్లాగే తనకు కూడా నాయకుడేనని నాగబాబు చెప్పారు. పవన్ కల్యాణ్ ను తాను చిన్నప్పటి నుంచి చూశాననీ, ఆయన ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉండేవారని తెలిపారు. అలాంటప్పుడు ‘ఏం చేస్తున్నావ్ కల్యాణ్?’ అని ఇంట్లో ఎవరైనా ప్రశ్నిస్తే జవాబు చెప్పేవాడు కాదన్నారు. పవన్ కల్యాణ్ సమక్షంలో ఈరోజు జనసేనలో చేరిన అనంతరం నాగబాబు మీడియాతో మాట్లాడారు. పవన్ కల్యాణ్ పేరుకే తనకు తమ్ముడనీ, నిజానికి సాధారణ జనసేన కార్యకర్తల్లాగే తనకూ పవన్ నాయకుడని వ్యాఖ్యానించారు. పార్టీలో చేరకముందే ఎలాంటి బాధ్యత అప్పగించినా అంకితభావంతో పనిచేసేందుకు సిద్ధమయ్యానని తెలిపారు. జనసేన కార్యాలయంలో తనకు క్లీనింగ్ పని ఇచ్చినా చేసేందుకు రెడీ అని చెప్పానన్నారు. తనకు నరసాపురం లోక్ సభ అభ్యర్థిగా నిలబెట్టి పవన్ గొప్ప గౌరవం ఇచ్చారన్నారు. పవన్ కల్యాణ్ ఇచ్చిన స్ఫూర్తి, బలం, ధైర్యంతోనే ఇటీవల తాను మాట్లాడానని స్పష్టం చేశారు. తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు పవన్ కల్యాణ్ కు నాగబాబు కృతజ్ఞతలు చెప్పారు. రాజకీయాల్లోకి రావాలని తనకు చాలా కోరికగా ఉండేదని మెగాబ్రదర్ నాగబాబు తెలిపారు. అయితే ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనమైన తర్వాత వాటన్నింటిని వదిలేశానని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత తమ్ముడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టినా తాను దూరంగానే ఉన్నాని చెప్పారు. తమ్ముడిని తమ్ముడిగా కాకుండా నాయకుడిగా చూడాలని తాను భావించానన్నారు. పవన్ కల్యాణ్ గొప్ప వ్యక్తిత్వం ఉన్న నేత అని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ కు తనకు వయసులో చాలా వ్యత్యాసం ఉందనీ, ఆయన్ను తాను ఎత్తుకుని ఆడించానని నాగబాబు గుర్తుచేసుకున్నారు. అప్పట్లో క్యూట్ గా, ముద్దుముద్దుగా ఉన్న పవన్ కల్యాణ్ ఇప్పుడు గొప్ప నాయకుడిగా మారాడని ప్రశంసించారు. పవన్ కల్యాణ్ విషయంలో ఇన్ వాల్వ్ కాకూడదని తమ ఫ్యామిలీ ఓ అవగాహనకు వచ్చిందన్నారు. పవన్ గతంలో తన ఫోన్లను ఎత్తేవాడు కాదనీ, ఎందుకొచ్చిందిలే అని భావించేవాడని నవ్వులు పూయించారు. నరసాపురం లోక్ సభ స్థానాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నాగబాబుకు కేటాయించిన సంగతి తెలిసిందే. అలాగే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తన సోదరుడు నాగబాబును దొడ్డిదారిన కాకుండా నేరుగా ప్రజా క్షేత్రంలో నిలబెడుతున్నానని వ్యాఖ్యానించారు. నాగబాబును రాజమార్గంలో రాజకీయాల్లోకి తీసుకొస్తున్నానని చెప్పారు. నాగబాబు అందరికి అందుబాటులో ఉండే వ్యక్తి అని పవన్ కల్యాణ్ తెలిపారు. ఆయనకు రాజకీయాలపై స్పష్టమైన అవగాహన ఉందన్నారు. అందుకే నరసాపురం లోక్ సభ స్థానం నుంచి జనసేన తరఫున నాగబాబును పోటీకి దించుతున్నామని ప్రకటించారు. అన్నింటిని వదులుకుని తన పిలుపు మేరకు అన్న నాగబాబు రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. ఆయనకు మనస్ఫూర్తిగా పార్టీలోకి స్వాగతం పలుకుతున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జనసేనలో చేరిన నాగబాబుకు పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.