‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రంతో నాగార్జునకు భారీ విజయాన్ని తెచ్చి పెట్టిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలో బంగార్రాజు పాత్రకు మంచి స్పందన దక్కింది. దాంతో ఆ పాత్రను ఆధారంగా చేసుకుని ‘బంగార్రాజు’ అనే చిత్రాన్ని తెరకెక్కించేందుకు కళ్యాణ్ కృష్ణ ప్రయత్నాలు చేస్తున్నాడు. మంచి స్క్రిప్ట్‌తో వస్తే తప్పకుండా సీక్వెల్ లేదా ప్రీ క్వెల్ చేద్దాం అంటూ నాగ్ దర్శకుడికి హామీ ఇచ్చాడు. ఇప్పటికి కూడా తనకు బంగార్రాజు పాత్ర చేయాలని ఉందని, మంచి స్క్రిప్ట్ వస్తే తప్పకుండా చేస్తాను అంటూ చెబుతున్నాడు. ఇన్నాళ్లుగా బంగార్రాజు గురించి అంతా మర్చి పోయారు. ఈ సమయంలో స్వయంగా నాగార్జున మాట్లాడుతూ ప్రస్తుతం బంగార్రాజు స్క్రిప్ట్‌ను రాసే పనిలో పలువురు రచయితలు ఉన్నారు అంటూ చెప్పుకొచ్చాడు.
కళ్యాణ్ కృష్ణ ‘రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్రంతో రెండవ విజయాన్ని అందుకున్నా, నేలటికెట్‌తో మూడవ విజయాన్ని దక్కించుకోలేక పోయాడు. నేల టికెట్ చిత్రం మొదటి ఫ్లాప్‌ను కళ్యాణ్ కృష్ణకు అందించింది. నేల టికెట్ ప్రభావంతో బంగార్రాజు చిత్రాన్ని నాగార్జున లైట్ తీసుకుంటాడు అని అంతా అనుకున్నారు. కాని అనూహ్యంగా తనకు బంగార్రాజు చేయాలనే ఆసక్తి ఉందని, స్క్రిప్ట్ రెడీ చేయమంటూ దర్శకుడు కళ్యాణ్ కృష్ణను ప్రోత్సహిస్తున్నాడు. వచ్చే ఏడాదిలో బంగార్రాజు ప్రారంభం అయ్యేలా నాగార్జున ప్లాన్ చేస్తున్నాడు. బంగార్రాజు చిత్రాన్ని స్వయంగా నాగార్జున నిర్మించబోతున్నాడు. కళ్యాణ్ కృష్ణ డిజాస్టర్ ఇచ్చినా కూడా బంగార్రాజు చిత్రంతో మరో ఛాన్స్‌ను ఇవ్వాలని నాగార్జున భావిస్తున్నాడు. మరి ఇది ఎలాంటి ఫలితానికి దారి తీస్తుందో చూడాలి.