అక్కినేని నాగార్జున కెరీర్లో సూపర్ హిట్ చిత్రాల జాబితాలో ‘మన్మధుడు’ చిత్రం ముందు వరుసలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పట్లో సంచలన విజయాన్ని దక్కించుకున్న మన్మధుడు చిత్రం ఇప్పటికి కూడా టీవీల్లో ప్రసారం అయితే ప్రేక్షకులు టీవీలకు అతుక్కు పోతారు. ఆ సినిమా ఆడియో కూడా మంచి విజయాన్ని దక్కించుకుంది. అందుకే నాగార్జున ఆ చిత్రాన్ని అనేక సందర్బాల్లో ప్రత్యేకం అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆ ప్రత్యేకమైన సినిమాకు సీక్వెల్ చేసే యోచనలో నాగార్జున ఉన్నాడా అంటూ సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ చర్చకు కారణం నాగార్జున ‘మన్మధుడు 2’ అనే టైటిల్‌ను అన్నపూర్ణ స్టూడియో బ్యానర్‌పై రిజిస్ట్రర్ చేయించడమే.
‘మన్మధుడు 2’ టైటిల్‌ను రిజిస్ట్రర్ చేయించడంతో ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. నాగార్జున ప్రస్తుతం మన్మధుడు టైటిల్‌తో సినిమా చేయడం ఏమాత్రం బాగుండదు. అందుకే ఆ టైటిల్ అఖిల్‌కు అయ్యి ఉంటుందని ఎక్కువ శాతం ప్రేక్షకులు మరియు సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ టైటిల్ అఖిల్‌కు కాకుంటే చైతూకు అయినా అయ్యి ఉండవచ్చు అంటున్నారు.
మన్మధుడు టైటిల్‌కు నాగచైతన్య కూడా అర్హుడే అంటూ అక్కినేని అభిమానులు చెబుతున్నారు. త్వరలో త్రివిక్రమ్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఒక చిత్రం ఉండే అవకాశం ఉంది. ఆ చిత్రానికి ఈ టైటిల్‌ను పెట్టే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2020లో మన్మధుడు 2 ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మన్మధుడు 2 విషయంలో నాగార్జున నుండి క్లారిటీ కోరేందుకు మీడియా ప్రయత్నిస్తుంది. కాని నాగ్ మాత్రం ఆవిషయం ప్రస్తుతానికి సస్పెన్స్ అంటూ దాటవేసే ప్రయత్నం చేస్తున్నాడు.