తిత్లీ తుఫాను పెను బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. తిత్లీ సృష్టించిన ప్రళయానికి సిక్కోలు విలవిల్లాడిపోతోంది. కనీస సదుపాయాలు లేక జనాలు రోడ్డున పడ్డారు. మరోవైపు లక్షల ఎకరాలు నీటమునిగాయి. పలు వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కాగా పరిస్థితిని చక్కదిద్దేందుకు ఓ వైపు నుంచి ప్రభుత్వ చర్యలు కొనసాగుతుంటే..మరోవైపు నుంచి స్వచ్ఛంధ సంస్థలు, సెలబ్రిటీలు ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై సెలబ్రిటీలు ఈ మేరకు స్పందిస్తుతున్నారు.
ఈ క్రమంలో బాధితులను ఆదుకునేందుకు రూ. 15 లక్షలు ఇస్తున్నానని జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించారు. ఈ మేరకు ఏపీ సీఎం సహాయనిధికి పంపుతున్నట్లు తెలిపారు. ఇదే సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ అన్న, హీరో కల్యాణ్ రామ్ కూడా తనవంతు సాయంగా రూ. 5 లక్షలు ఏపీ సీఎం సహాయనిధికి పంపుతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడీయాలో ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే ఈ విషయంపై స్పందించిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ..సీఎం రిలీఫ్ ఫండ్ కు తన బ్యాంక్ ఖాతా నుంచి రూ.5 లక్షలు ట్రాన్స్ ఫర్ చేసిన విషయం తెలిసిందే.