Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నంద్యాల ఫలితంతో టీడీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహం వెల్లివిరుస్తోంది. నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు ఈ ఫలితంపై హర్షం వ్యక్తంచేశారు. అభివృద్ధి, సంక్షేమంపై నంద్యాల ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. . నంద్యాలలో అన్ని వర్గాల ప్రజలు టీడీపీని ఆదరించారని, ఈ ఫలితం రాబోయే ఎన్నికలకు నిదర్శనమని బాబు అన్నారు. నంద్యాలలో 15 రోజలు పాటు బసచేసి ప్రలోభాలకు పాల్పడినా జగన్ ను ప్రజలు తిరస్కరించారని చెప్పారు. తనను నడిరోడ్డు మీద కాల్చిచంపమన్న వ్యక్తికి తాను కోరుకున్నట్టుగా నంద్యాల ఓటర్లు ఓటుతోనే బదులిచ్చారని చంద్రబాబు అన్నారు.
ఈ గెలుపును దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామని, అవినీతి నిర్మూలనతో ప్రజలు మెచ్చుకునే పాలన అందించి రాష్ట్రంలో టీడీపీ శాశ్వతంగా అధికారంలో ఉండేలా చేస్తామని చంద్రబాబు చెప్పారు. నంద్యాల గెలుపుపై మంత్రి అఖిలప్రియ ఆనందం వ్యక్తంచేశారు. భూమా కుటుంబం, టీడీపీపై ఉన్న నమ్మకంతోనే నంద్యాల ప్రజలు తమకు ఓట్లేశారని చెప్పారు. టీడీపీకి డిపాజిట్ కూడా దక్కదన్న వారికి ఈ ఫలితం చెంపపెట్టులాంటిదన్నారు.
రాయలసీమ అభివృద్ధికి కృషి చేసి తన తండ్రి ఆశయాలు నెరవేరుస్తానని అఖిల ప్రియ అన్నారు. జగన్ చెప్పినట్టుగానే టీడీపీ మూడేళ్ల పాలనకు ఈ ఉప ఎన్నిక ఫలితం రెఫరెండం అని ఆ పార్టీ నేతలు అంటున్నారు. చంద్రబాబు పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారనటానికి ఈ ఫలితం నిదర్శనమని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి అన్నారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు చంద్రబాబు పడుతున్న కష్టాన్ని ప్రజలు గుర్తించారన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో జగన్ వాడిన భాష ప్రజలకు ఆగ్రహం తెప్పించిందని…ఆ ఆగ్రహమే ఉప ఎన్నికలో కనిపించిందని సోమిరెడ్డి అభిప్రాయపడ్డారు. జగన్ ఇప్పటికైనా తన ప్రవర్తను మార్చుకుని హుందాగా వ్యవహరించాలని మంత్రులు సూచించారు.
మరిన్ని వార్తలు: