Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
యనమల రామకృష్ణుడు టీడీపీ లో అగ్రనేత. ఆయన పార్టీ లో చేరినప్పటినుంచి వయసుతో సంబంధం లేకుండా ప్రాధాన్యం లభిస్తూనే వుంది. 1994 లో ఆయన స్పీకర్ అయ్యారు. ఎన్టీఆర్ ని గద్దె దించిన ఘటనలో యనమల పాత్ర ఎలాంటిదో అందరికీ తెలుసు. నాటి విషయాలు ఎప్పుడూ ఎన్నడూ మర్చిపోయేంత చిన్నవి కాదు. అందుకే సీఎం చంద్రబాబు యనమలకు అంత ప్రాధాన్యం ఇస్తారు. ఓ విధంగా చెప్పాలంటే ఈస్ట్ గోదావరిలో సామాజికంగా, రాజకీయంగా యనమలని మించిన నేతలు ఉన్నప్పటికీ చంద్రబాబు అండ అనే ఒక్క ఆయుధంతో ఆయన జిల్లా టీడీపీ రాజకీయాల్లో పెత్తనం చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో పదవులు పొందుతున్నారు. పైకి ఏమి చెప్పినా ఈస్ట్ టీడీపీ లో యనమల హవా ని తట్టుకోలేక పార్టీ లో జనాదరణ వున్న నాయకులు చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే ఇటీవల కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలతో సీన్ మారిపోయిందని జిల్లా అంతా తెలిసిపోయింది.
కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించినప్పటికీ ఆ ఘనత ఈసారి యనమల కోటాలో పడలేదు. ఆయన అనుకున్న వారికి మేయర్ పదవి దక్కలేదు. అంతకుముందు జ్యోతుల నెహ్రు కుమారుడు జ్యోతుల నవీన్ జడ్పీ చైర్మన్ కాకుండా చూసేందుకు సర్వశక్తులూ ఓడినా యనమల దాన్ని అడ్డుకోలేకపోయారు. దీంతో ఈస్ట్ లో యనమల ఆధిపత్యానికి చెక్ పడిందని తేలిపోయింది. ఎందుకు ఇలా జరిగిందా అని ఆరా తీస్తే కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగుజూశాయి.
2014 లో టీడీపీ అధికార పగ్గాలు చేపట్టాక పార్టీలో కాపులకి ప్రాధాన్యత పెరిగింది. అయితే కాపులకి కంచుకోట లాంటి ఈస్ట్ లో మాత్రం యనమల హవా కొనసాగింది. ఉప ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్ గా చిన రాజప్ప ఉన్నప్పటికీ యనమల స్పీడ్ కి తిరుగు లేకుండా పోయింది. ఇదే విషయాన్ని పార్టీలోకి కొత్తగా వచ్చి ఎంపీ అయిన తోట నరసింహం గమనించారు. ఆయన నెమ్మదిగా యనమల వ్యతిరేక వర్గాన్ని ఒక్క చోటుకి చేర్చగలగడంతో పాటు యువ నేత లోకేష్ దగ్గర తమ గోడు వినిపించారు. ఆయన నుంచి స్పష్టమైన హామీ లభించాక సైలెంట్ గా రంగంలోకి దిగారు. కాకినాడ మేయర్ ఎంపిక జరిగేటప్పుడు తమ ప్లాన్ అమలు చేశారు. అధిష్టానం సీల్డ్ కవర్ లో తన వ్యతిరేక వర్గం అభ్యర్థిని మేయర్ గా చేయడంతో యనమల షాక్ అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న యనమల వ్యతిరేక వర్గం నాయకుడు సరదాగా మిర్చి సినిమా డైలాగ్ పేల్చాడు.”అప్పుడలా కాదు… ఇప్పుడు ఆయన కొడుకు వచ్చాడంటూ”. ఈ డైలాగ్ లోకేష్ ని దృష్టిలో పెట్టుకుని అన్నారని వేరే చెప్పాలా?