Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అభివృద్ధి పథంలో ముందుకెళ్తామంటే ప్రజలెప్పుడూ వెనకడుగు వేయరని, గ్యాస్ రాయితీ వదులుకోమన్నా…నోట్ల రద్దు చేసినా..జీఎస్టీని అమల్లోకి తెచ్చినా ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారని ప్రధాని కృతజ్ఞతలు తెలియజేశారు.
125 కోట్లమంది భారతీయులందరం ఒక్కటై ఏ సంకల్పమైనా సాధించగలమని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. 71వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటలో ప్రధాని జాతీయజెండా ఆవిష్కరించారు. అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశ యువత నిరాశానిప్పృహలను వీడి ముందుకు నడవాలని, కొత్త సంకల్పంతో దూసుకుపోవాలని ప్రధాని పిలుపునిచ్చారు.
21వ శతాబ్దంలో జన్మించిన యువతకు 2018 కొత్త అవకాశం కల్పిస్తోందని…వారు మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నార ప్రధాని అన్నారు. దేశ ప్రగతిని కొత్త దిశగా నడిపించే అవకాశం యువతకు వచ్చిందని…వారు తమ శక్తియుక్తులను, సామర్థ్యాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. రెండున్నరేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన పథకాలు, చేపట్టిన చర్యల గురించి ప్రధాని తన ప్రసంగంలో వివరించారు. దేశంలో వేగవంతమైన చర్యలకు శ్రీకారం చుడుతున్నామని, రాష్ట్రాలకు మరింత ఆర్థిక సౌలభ్యాన్ని కల్పించి వేగవంతమైన అభివృద్ధికి కృషిచేస్తున్నామని తెలిపారు.
రైతులకు సాగునీరిస్తే బంగారం పండిస్తారని, ప్రధానమంత్రి కృషి యోజన ద్వారా రైతులకు సాగునీరందించే కార్యక్రమం వేగవంతం చేస్తున్నామని, మార్కెట్ వ్యవస్థలో లోపాలను సరిదిద్దేందుకు కొత్త విధానాలతో ముందుకొస్తున్నామని అన్నదాతకు భరోసా ఇచ్చారు. యువత ఉద్యోగాలు కోసం ఎదురుచూసే పనిలేకుండా వారే కొత్త ఉద్యోగాలు సృష్టించే పరిస్థితులను కల్పిస్తున్నామని చెప్పారు. దేశం నిజాయితీ పరులదని, అక్రమార్కులకు ఇందులో చోటు లేదని మోడీ హెచ్చరించారు. సముద్రం, సరిహద్దు, సైబర్ ఇలా…ఎక్కడైనా భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని మోడీ స్పష్టంచేశారు.
ప్రభుత్వ వ్యవహారాలను సులభతరం చేస్తున్నామని, ప్రభుత్వ నిబంధనల బంధనాల నుంచి ప్రజలకు విముక్తి కల్పించే ప్రయత్నం సాగుతోందని వివరించారు. జమ్ము కాశ్మీర్ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పిన మోడీ కొన్ని సమస్యలు తుపాకులు, ఆరోపణలతో పరిష్కారం కావని, ప్రజలు ఒకరికొకరు మమేకమై భుజం భుజం కలిపినపుడే శత్రువును సమర్థంగా ఎదుర్కోగలమని అన్నారు. మత విశ్వాసాల పేరుతో తలెత్తే ఆందోళనలకు దేశంలో చోటు లేదని, ప్రతి పౌరుడు సంపూర్ణ హక్కుతో జీవించే అవకశాముందని మోడీ చెప్పారు.
మరిన్ని వార్తలు: