Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రధాని మోడీ దేశమంతా విస్తృతంగా కలియతిరుగుతారు. భిన్న భాషలకు చెందిన అనేక రాష్ట్రాల్లో ఆయన ప్రసంగిస్తూ ఉంటారు. అలాగే ప్రధాని కాకముందూ ఆయన దేశమంతా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే తెలుగు రాష్ట్రాల విషయానికొచ్చేసరికి ప్రధానిగానూ, అంతకుముందూ కూడా ఆయన ఓ ప్రత్యేకత కనబరుస్తున్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా 2014లో హైదరాబాద్ నుంచి తొలి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన మోడీ… మొట్ట మొదటగా మాట్లాడింది తెలుగుమాటే. హైదరాబాద్ లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సోదరసోదరీమణులారా అంటూ ఆయన ప్రసంగాన్ని ప్రారంభించడం జాతీయ మీడియాను సైతం ఆశ్చర్యపరిచింది.
ఇంగ్లీష్, హిందీ జాతీయ చానళ్లు మోడీ తెలుగులో మాట్లాడడాన్ని పదేపదే ప్రసారం చేశాయి. అలాగే తాజాగా జీఈఎస్ లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన మోడీ బేగంపేట ఎయిర్ పోర్టులో తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన సభలో మాట్లాడుతూ మోడీ ఒక్కనిమిషం పాటు పూర్తిగా తెలుగులో ప్రసంగించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సోదర సోదరీమణులారా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు.
హైదరాబాద్ కు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇది అద్భుతమైన నగరం, హైదారబాద్ అంటే ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గుర్తొస్తారు. హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ లో కలిపిన ఆయనకు వీరభూమి నుంచి ప్రణామాలు చేస్తున్నాను. తెలంగాణ విమోచనంలో ప్రాణాలర్పించిన అమరులకు జోహార్లు.
4కోట్ల తెలంగాణ ప్రజలకు అభినందనలు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. నాకు ఘనస్వాగతం పలికిన ప్రతి బీజేపీ కార్యకర్తకు ధన్యవాదాలు అంటూ తెలుగులోనే ప్రసంగాన్ని ముగించారు మోడీ. మోడీ ఇలా పూర్తిగా తెలుగులో మాట్లాడడం చూసి స్థానిక బీజేపీ నేతలు, సభకు హాజరయిన వారితో పాటు… మీడియా కూడా సంభ్రమాశ్చర్యాలకు లోనయింది.