Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజకీయ నేతలు ఒక్కోసారి ప్రత్యర్థి పార్టీ నాయకులను విమర్శించేక్రమంలో తామేం మాట్లాడుతున్నారో కూడా మర్చిపోతుంటారు. అర్ధంపర్ధం లేని విమర్శలతో అభాసుపాలవుతుంటారు. సమాజ్ వాదీపార్టీ ఎంపీ నరేశ్ అగర్వాల్ ఈ కోవలో ముందువరుసలో ఉంటారు. తాజాగా రాహుల్ గాంధీని సమర్థించే క్రమంలో ఆయన చేసిన ఓ వ్యాఖ్య తీవ్ర వివాదాస్పదమయింది. వివరాల్లోకి వెళ్తే… గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు సాయంత్రం కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీలోని ఓ మాల్ లో స్టార్ వార్స్ సినిమా చూశారట. దీంతో బీజేపీ నేతలు రాహుల్ పై విమర్శలు గుప్పించారు. పార్టీ ఓటమి భారంతో కుమిలిపోతుంటే..నాయకుడు మాత్రం సినిమా చూసి ఆనందించారు అని కమలనాథులు ఎద్దేవాచేస్తున్నారు.
రాహుల్ వ్యక్తిగత జీవితంపై బీజేపీ నేతలు విమర్శలు చేయడాన్ని నరేశ్ అగర్వాల్ తప్పుపట్టారు. బీజేపీ ఒక సంకుచిత పార్టీ అని విమర్శించారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ రాహుల్ గాంధీని సమర్థించడానికి నరేశ్ అగర్వాల్ చెప్పిన ఓ పోలికే ఆయన్ను అభాసుపాలుచేస్తోంది. ఒక రాజకీయనాయకుడి శోభనం రాత్రికి ముహూర్తం పెట్టిన రోజే ఎన్నికల ఫలితాలు విడుదలయితే… ఆ నేత ఫస్ట్ నైట్ రద్దు చేసుకుంటాడా…అని నరేశ్ అగర్వాల్ హాస్యాస్పదంగా ప్రశ్నించారు. రాహుల్ గాంధీ వ్యక్తిగత విషయాలపై వారు మాట్లాడడం సిగ్గుచేటని నరేశ్ వ్యాఖ్యానించారు. రాహుల్ సినిమా చూడడాన్ని ఫస్ట్ నైట్ తో పోల్చడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు.