మా ఎన్నికలు…సూపర్ స్టార్ ను కలిసిన నరేష్ !

Naresh Panel Meets Mahesh Babu

టాలీవుడ్ లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ సీనియర్ నటుడు నరేష్ తన ప్యానెల్ అభ్యర్థులతో కలిసి సూపర్ స్టార్ మహేష్ బాబును కలిశారు. మా ప్రధాన కార్యదర్శి పదవికి పోటీపడుతున్న జీవిత, వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీచేస్తున్న హీరో రాజశేఖర్ కూడా నరేష్ తో పాటు మహేష్ ను కలిసి మద్దతు కోరారు. మా లో సరికొత్త కార్యవర్గం వచ్చేలా సపోర్ట్ అందించాలని మహేష్ ను కోరామని, ఆయన సానుకూలంగా స్పందించారని నరేష్ ట్విట్టర్ లో వెల్లడించారు. అంతేగాకుండా, మార్చి 10న జరిగే ఓటింగ్ కు తప్పకుండా హాజరవుతానని మాటిచ్చాడని కూడా తెలిపారు. మా ఎన్నికల్లో నరేష్ అధ్యక్ష పదవికి పోటీచేస్తున్నారు. ఇప్పటికే నామినేషన్లు కూడా దాఖలు చేశారు. ప్రస్తుత అధ్యక్షుడు శివాజీరాజా ప్యానెల్ కూడా బలంగానే ఉండడంతో ‘మా’ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.