National Politics: రిపబ్లిక్ డే వేడుకలకు దిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు

National Politics: Heavy security arrangements in Delhi for Republic Day celebrations
National Politics: Heavy security arrangements in Delhi for Republic Day celebrations

గణతంత్ర వేడుకలకు దేశ రాజధాని నగరం దిల్లీ ముస్తాబవుతోంది. ఈ మేరకు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. దిల్లీలోని కర్తవ్యపథ్‌ చుట్టూ 14 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ఈ ఏడాది గణతంత్ర వేడుకలకు 77వేలమంది ఆహ్వానితులు రానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ఠ నిఘా ఉంచినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు. భద్రతా, ట్రాఫిక్‌, జిల్లా యూనిట్లతో కలిసి నగరంలో భద్రతను సమన్వయం చేస్తామని దిల్లీ ప్రత్యేక పోలీసు కమిషనర్‌ దీపేంద్ర పాఠక్‌ వెల్లడించారు.

కర్తవ్యపథ్‌ వద్ద 14 వేల మందిని మోహరిస్తామని చెప్పారు. కమాండోలు, సత్వర స్పందన దళాలు, పీసీఆర్ వ్యాన్లు, స్వాట్‌ బృందాలు నిర్దేశిత ప్రాంతాల్లో ఉంటాయని వెల్లడించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేలా దిల్లీ పోలీసులు సిద్ధమైనట్లు ప్రత్యేక కమిషనర్‌ పాఠక్‌ తెలిపారు. గగనతలం నుంచి తలెత్తే ముప్పును సైతం ఎదుర్కొనేలా సిద్ధమైనట్లు వివరించారు. న్యూదిల్లీ జిల్లాను 28 జోన్లుగా విభజించి రక్షణ ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జనవరి 25 రాత్రి 10 గంటల నుంచి జనవరి 26 ఉదయం వరకూ వాహనాల రాకపోకలను నియంత్రణ, దారి మళ్లింపులు ఉంటాయని దిల్లీ ట్రాఫిక్‌ ప్రత్యేక కమిషనర్‌ హెచ్జీఎస్ ధాలివల్ చెప్పారు.