జగన్ ఈ సారి ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలవడమే లక్ష్యమని అంటున్నారు. ఇదే క్రమంలో సరిగ్గా పనిచేయని ఎమ్మెల్యేలని ఈ సారి పక్కన పెట్టేస్తామని, కొత్తవారికి అవకాశం ఇస్తామని అంటున్నారు. ఇటీవల ఎమ్మెల్యేలతో సమావేశంలో కూడా అదే చెప్పారు. కొందరు సిట్టింగులని పక్కన పెట్టక తప్పదు అని చెబుతున్నారు.
ఈ క్రమంలోనే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కొందరు సిట్టింగులకు సీటు విషయం డౌటే అని విశ్లేషకులు అంటున్నారు. నెల్లూరులో 10 సీట్లు ఉంటే..10 చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. కాకపోతే అందులో ముగ్గురు ఎమ్మెల్యేలు టిడిపి వైపు వచ్చారు. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డి టిడిపిలోకి వచ్చారు. ఇక ఆ మూడు స్థానాల్లో వైసీపీ ఇంచార్జ్‌ని పెట్టారు. ఆ మూడు సీట్లు పక్కన పెడితే..మిగిలిన 7 సీట్లలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు.
ఆ 7 గురులో మళ్ళీ ఎవరికి సీటు దక్కుతుందనేది క్లారిటీ లేదు. అందులో సర్వేపల్లి లో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి మళ్ళీ సీటు ఫిక్స్. ఆత్మకూరులో మేకపాటి విక్రమ్‌కు సీటు ఖాయమే. కావలిలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి కూడా దాదాపు సీటు ఖాయమే అని తెలుస్తోంది.
ఇటు నెల్లూరు సిటీలో అనిల్ కుమార్ యాదవ్‌కు మళ్ళీ ఛాన్స్ ఉంటుంది. కానీ గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్, సూళ్ళూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్యలపై వ్యతిరేకత ఎక్కువగానే ఉంది. వారికి సీటు విషయం కాస్త డౌటే అని తెలుస్తోంది. అటు కోవూరులో ప్రసన్న కుమార్ రెడ్డి మళ్ళీ పోటీ చేసే ఛాన్స్ ఉంది.