Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నటీనటులు : రానా , కాజల్ , కేథరిన్ , నవదీప్
నిర్మాత : సురేష్ బాబు
దర్శకత్వం : తేజ
మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్
ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వర రావు
సినిమాటోగ్రఫీ : వెంకట్ సి.దిలీప్
బాహుబలి, ఘాజీ విజయాల తర్వాత ఈ మధ్య కాలంలో అంతగా హిట్స్ లేని తేజ దర్శకత్వంలో దగ్గుబాటి రానా సినిమా చేస్తున్నారు అనగానే చాలా మంది నొసలు చిట్లించారు. అయితే ఆ సినిమా నిర్మాణంలో రానా తండ్రి, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు భాగస్వామి అయ్యారన్న వార్త వినగానే చిట్లించిన నొసళ్ళు ఆశ్చర్యంతో విప్పారాయి. నేనే రాజు నేనే మంత్రి పేరు బయటికి రాగానే సినిమాలో ఏదో ఉందనిపించింది. ఇక విడుదల దగ్గరికి వచ్చేసరికి సినిమా గురించి ఎక్కడలేని ఆసక్తి పెరిగింది. అంచనాలు లేకుండా షూటింగ్ మొదలెట్టుకుని రిలీజ్ నాటికి భారీ అంచనాలు ఏర్పరుచుకున్న “నేనే రాజు నేనే మంత్రి ” ఎలా ఉందో చూద్దామా!
కథ…
జోగేంద్ర కి ఉరిశిక్ష విధించడానికి అనంతపురం సెంట్రల్ జైలు కి తీసుకురావడంతో కథ మొదలు అవుతుంది. తన జీవితాన్ని ప్రజలందరికీ తెలిసేలా తాను చెప్పే విషయాన్ని టీవీల్లో లైవ్ ఇవ్వాలని అతని చివరి కోరికను కోర్టు మన్నిస్తుంది. దీంతో కథ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళుతుంది. జోగేంద్రకి కుటుంబం అంటే అమిత ప్రేమ ముఖ్యంగా రాధ అంటే ప్రాణం. ఇంటి విషయంలో హీరోగా వుండే జోగేంద్ర మిగిలిన సమాజం పట్ల మాత్రం పూర్తి స్వార్ధంతో ప్రవర్తిస్తాడు. ఓసారి ఒక సర్పంచ్ భార్య చేతిలో అతని కుటుంబానికి అవమానం జరుగుతుంది. దీన్ని సీరియస్ గా తీసుకున్న జోగేంద్ర సవాల్ చేసి మరీ సర్పంచ్ అవుతాడు. అక్కడితో ఆగకుండా రాజకీయంగా ఎదగడానికి ఎన్ని కుయుక్తులు పన్నాలో అన్నీ పన్నేస్తాడు. మంత్రి స్థాయికి వచ్చేస్తాడు. ఈ రాజకీయ ప్రయాణంలో అతని ఎత్తులు, జిత్తులు నాటకీయంగా ఉంటాయి. అంతా సవ్యంగా సాగిపోతున్న తరుణంలో జోగేంద్ర జీవితంలో ఊహించని పరిణామం మొత్తం కథా గమనాన్ని మార్చి వేస్తుంది. బయట స్వార్ధానికి, ఆశకి పుట్టిన మనిషిలా వుండే జోగేంద్ర రాధ ప్రేమ, అనురాగాలకి తహతహలాడుతాడు. అందరూ అతనిలోని గెలుపుని మాత్రమే చూస్తుంటే నైతికంగా అతన్ని బాలన్స్ చేసే ప్రయత్నం చేసే పాత్రలో నవదీప్ కనిపిస్తాడు. జోగేంద్ర సొంతంగా ఓ పార్టీ పెట్టి ఎన్నికల్లో దాన్ని గెలిపిస్తాడు. ఆలా రాజకీయ నిచ్చెన ఎక్కిన రానా జీవితం సుడిగుండంలో చిక్కుకోడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి? చివరకు ఏమి జరిగిందన్నదే “నేనే రాజు నేనే మంత్రి “.
విశ్లేషణ…
పరిస్థితులు ఓ మంచి వాడిని చెడ్డగా మార్చడమో, ఓ చెడ్డవాడిని మంచి వైపు నడిపించడమో ఇప్పటిదాకా ఎన్నో సినిమాల్లో చూసాం. కానీ ఈ సినిమాలో జోగేంద్ర క్యారెక్టర్ ఒకే సమయంలో ఇటు చెడుని అటు ప్రేమని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇలాంటి పాత్ర సృష్టించి దర్శకుడు తేజ నటుడు రానా కి సవాల్ విసిరితే దాన్ని అవలీలగా చేసాడు రానా . జోగేంద్ర పాత్ర నటుడికి ఓ ఊటబావి లాంటిది . ఎంతైనా తోడుకోవచ్చు. రానా అదే చేసాడు. రానా, కాజోల్ మధ్య ప్రేమ బంధం, నవదీప్ తో సీన్స్, హాస్పిటల్ సీన్, ప్రదీప్ రావత్ సీన్ రానాలోని నటుడిని హైలైట్ చేస్తే మొత్తం సినిమాని అతను ఒంటి చేత్తో నడిపించాడు. వాణిజ్య పరమైన అంశాలు పక్కనబెడితే రానా కెరీర్ లో ఎన్నటికీ నిలిచిపోయే పాత్ర జోగేంద్ర.ఇక రాధ పాత్రకి కాజల్ అతికినట్టు సరిపోయింది. కథెరిన్ , నవదీప్ పాత్రలు కూడా ఈ సినిమాకి ఆయువుపట్టులాంటివి.
దర్శకుడు తేజ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒక్కసారి ఓ పద్ధతికి అలవాటు పడ్డాక దాని నుంచి బయటకు రావాలంటే చాలా కష్టం. ఆలోచనల విషయంలో ఇది ఎక్కువగా వర్తిస్తుంది. కానీ నేనే రాజు నేనే మంత్రి కథతో తేజ లో వచ్చిన మార్పుని మనం స్పష్టంగా చూడొచ్చు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఇలాంటి ఫామిలీ, క్యారెక్టర్ ఓరియెంటెడ్ సినిమా చేయాలి అనుకోవడమే కాదు అందుకోసం రాసుకున్న సీన్స్ బాగున్నాయి. ముఖ్యంగా రానా క్యారెక్టర్ ని ఎలివేట్ చేసే సీన్స్ హైలైట్. ఇక రాజకీయాల గురించి డైలాగ్స్. నవదీప్, కాజల్, కథెరిన్ పాత్రల రూపకల్పన తో తేజ ఓ మెట్టు పైన కనిపించాడు.అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఇక సురేష్ ప్రొడక్షన్స్, బ్లూ ప్లానెట్ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణ విలువలు అద్భుతం.
ప్లస్ పాయింట్స్ …
జోగేంద్ర పాత్ర , రానా నటన
నవదీప్, రానా మధ్య సీన్స్
కాజల్ పాత్ర
తేజ దర్శకత్వం, పాలిటిక్స్ పై డైలాగ్స్, రాజకీయ ఎత్తులు.
మైనస్ పాయింట్స్ …
సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ డ్రాగ్