నేపాల్లో భూకంపం పెను విషాదం సృష్టిస్తోంది. నేపాల్ వాయువ్య జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి 11 గంటల తర్వాత భూమి కంపించింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 128కి చేరింది. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ విపత్తులో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రతికూల పరిస్థితుల మధ్యే సహాయ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
నేపాల్ ముఖ్యంగా రుకుమ్, జాజర్కోట్ జిల్లాలో భూకంప ప్రభావం తీవ్రంగా ఉందని.. అధికారులు ఈ రెండు జిల్లాల్లోనే 128 మంది మృతి చెందారని తెలిపారు. ఘటనాస్థలిని ప్రధాన మంత్రి పుష్పకమల్ దహల్ పరిశీలించారు. భూకంపం వల్ల జరిగిన ఆస్తి , ప్రాణ నష్టాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితులను ఆదుకుంటామని భరోసానిచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన సేవలు అందించాలని వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విపత్తు సంభవించడం చాలా విచారకరమని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
నేపాల్లోని భూకంప తీవ్రతకు భారత్లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. దిల్లీ, ఉత్తర్ప్రదేశ్, బిహార్లోని వివిధ ప్రాంతాల్లో భూమి కంపించడంతో స్థానికులు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.