తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల్లో అయినా సత్తా చాటి పరువు నిలుపుకోవాలనుకుంటుంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఆ దిశగా దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలోని అన్ని జిల్లాలకు వెంటనే డీసీసీ అధ్యక్షులను నియమించాలని రాహుల్ గాంధీ ఆదేశించినట్లు టీపీసీసీ సమాచారం.
నేడు ఢిల్లీలో రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ కుంతియా, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలోని మండల, బ్లాక్ కమిటీలను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తమ్ తెలిపారు. జనవరి 10వ తేదీలోగా సంస్థాగతంగా పార్టీ పదవులను భర్తీ చేయాలని రాహుల్ గాంధీ ఆదేశించారని అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన అభ్యర్ధులే పంచాయతీ ఎన్నికలు, లోకసభ ఎన్నికలు పూర్తయ్యేంతవరకు ఆయా నియోజకవర్గాలకు ఇంచార్జ్ లు గా వ్యవహరించాలని అధిష్ఠానం ఆదేశించిందని, తెలంగాణ కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో రానున్న ఎన్నికలకు సమాయత్తం చేయాలని రాహుల్ గాంధీ ఆదేశించారని ఉత్తమ్ వెల్లడించారు. ప్రస్తుత ప్రదేశ్ ఎన్నికల కమిటీ సైజును తగ్గించి, కొత్తగా 15మందితో కమిటీ ఏర్పాటు చేసి లోకసభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించాలని ఆయన చెప్పారు.