సామాజిక మాధ్యమం ‘ఫేస్బుక్’లో కంపెనీ యాజమాన్యం కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. కరోనా వైరస్ కారణంగా అనుకోకుండా సెలవులు రావడం లేదా ఇంటి పట్టునే ఉండాల్సి రావడం వల్ల లేదా సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నా ఆతృత వల్ల ఫేస్‌బుక్‌ను ఎక్కువగా ఉపయోగించి యూజర్లు అలసిపోయి ఉండవచ్చు. కొంత కాలం పాటు విశ్రాంతి తీసుకోవాలనిపించవచ్చు. ‘అమ్మో! విశ్రాంతి తీసుకుంటే ఎలా ? అవతలి వారి పోస్టింగ్స్‌కు సకాలంలో స్పందించపోతే వారికి కోపం రాదు! గ్రూప్‌కు గుడ్‌బై చెప్పరు లేదా గ్రూప్ నుంచి తీసేయరు!’ అనే ఆందోళన కలగవచ్చు.
అలాంటి ఆందోళనలను తొలగించి యూజర్లు కావాల్సినంత విశ్రాంతి కల్పించేందుకే ఫేస్బుక్ ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీన్ని ‘క్వైడ్ మోడ్’గా వ్యవహరిస్తున్నారు. అంటే స్పందించకుండా ‘నిశ్శబ్దం’గా ఉండిపోవడం. ఎవరు, ఎంత సేపు ఈ మోడ్‌లో ఉండదల్చుకున్నారో! అంతసేపు సమయాన్ని పేర్కొని విశ్రాంతి తీసుకోవచ్చు. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కాలం గడిపేందుకు, ప్రశాంతంగా నిద్ర పోవడానికి ఈ మోడ్ తోడ్పడుతుందని ఫేప్‌బుక్ యాజమాన్యం పేర్కొంది.
కరోనా వైరస్ కారణంగా చాలా మంది ఉద్యోగాలు లేదా ఉపాధి కోల్పోయి మానసికంగా ఆందోళనకు గురవుతుండవచ్చని, అలాంటి వారికి మరింత మానసిక ఒత్తిడి తీసుకరాకూడదనే సదుద్దేశంతోనే ఈ మోడ్‌ను ప్రవేశ పెట్టామని, ప్రస్తుతం ఈ మోడ్ ఐవోఎస్ ఫ్లాట్‌ఫారమ్ మీద పని చేస్తోందని, జూన్ నెల నాటికి ఆండ్రాయిడ్‌కు కూడా అనుసంధానం చేస్తామని యాజమాన్యం ప్రకటించింది.